బడ్జెట్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఊహాగానాలు, విశ్లేషణలు మొదలయ్యాయి. ఏటా అప్పటి కాల మాన పరిస్థితులను బట్టి వ్యూహం మార్చడం ప్రభుత్వాలు తరచూ చేసే పనే. గత బడ్జెట్ లో గంగానదీ ప్రక్షాళన, స్మార్ట్ సిటీలకు అగ్రతాంబూలం ఇచ్చిన కేంద్రం ఈసారి ఏఏ రంగాలకు ప్రాధాన్యం ఇస్తుంది.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. 

ప్రస్తుతం వరకూ ఉన్న సమాచారం బట్టి ఈ ఏడాది బడ్జెట్ లో వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణ రహదారులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిసింది. గతంలో పారిశ్రామికంగా మేకిన్ ఇండియాను ఆయుధంగా చేసుకున్న కేంద్రం ఈసారి వ్యవసాయ రంగంలో మేకిన్ ఇండియా మంత్రం జపించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం కొన్ని పథకాలు రూపొందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే అవకాశం ఉంది. 

వ్యవసాయాన్ని బాగా ప్రమోట్ చేసేందుకు కొత్త పద్దతులను ప్రోత్సహించే దిశగా బడ్జెట్ రూపకల్పన ఉండొచ్చు. ఎప్పుడూ ఒకే రకం పంటలు, భూముల పరిస్థితి పట్టించుకోకుండా విచ్చల విడిగా రసాయనాల వాడకం సాగును నష్టాల పాలు చేస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు భూసార పరిరక్షణ కార్డులను దేశవ్యాప్తంగా 140 మిలియన్ల రైతుకుటుంబాలకు వచ్చే మూడేళ్లలో అందజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందట. 

వ్యవసాయాన్ని లాభాల బాట పట్టించేందుకు మేక్ ఇన్ ఇండియా లాంటి పథకాలు అమలు చేయాల్సిన అవసరముందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారం దిశగా కూడా ఈ బడ్జెట్ లో చర్యలు తీసుకునే అవకాశం ఉందట. మౌలిక సదుపాయాల కల్పన కోసం వ్యవసాయాభివృద్ధి కోసం, నీటిపారుదల సౌకర్యాల కోసం నిధులు కేటాయింపులు ఉండొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: