ఏటీఎం.. అకౌంట్లో డబ్బుంటే చాలు.. ఏ నిమిషమైనా విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్న సౌకర్యం ఇది. ఏటీఎం వచ్చాక పెద్ద మొత్తం డబ్బు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం తగ్గిపోయింది. మరి అవే ఏటీఎంలో డబ్బు కాకుండా.. అవసరమైన మందులు వస్తే ఎలా ఉంటుంది. లేటెస్టుగా చంద్రబాబు సర్కారుకు వచ్చిన ఐడియా ఇది. త్వరలోనే ఏపీలో ఏటీఎం తరహాలోనే మందుల కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తారట. 

ప్రత్యేకించి మెడికల్ షాపులు, ఆసుపత్రులు అందుబాటులో ఉండని మారుమూల ప్రాంతాల్లో ఈ ఎనీ టైమ్ మెడిసిన్ సెంటర్లు బాగా ఉపయోగపడతాయని ఆంధ్రా సర్కారు ఫీలవుతోంది. గ్రామీణ  ప్రాంతాల్లోని  వైద్య విద్యలో  సౌకర్యాలపై  దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం గ్రామీణులు, గిరిజనులకు 24 గంటలూ వైద్య సేవలందేలా రాష్ట్రవ్యాప్తంగా 27 ప్రాంతాల్లో హెల్త్ ఏటీఎంలను త్వరలోనే ఏర్పాటు చేస్తుందట. 

వైద్య ఆరోగ్య శాఖ, ఎన్టీఆర్ వైద్య సేవలపై విజయవాడ ముఖ్యమంత్రి  కార్యాలయంలో చంద్రబాబు నిర్వహించిన సమీక్షాసమావేశంలో ఈ ఐడియాపై చర్చ జరిగిందట. ప్రజారోగ్యం, వైద్య విభాగాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టాల్సిన అవసరముందని భావించిన చంద్రబాబు అందుకు టెక్నాలజీని ఆయుధంగా వాడుకోవాలని నిర్ణయించారట. 

విశాఖలో వైద్య పరికరాల ఉత్పత్తి కోసం మెడికల్ టెక్నాలజీ పార్కును ఏర్పాటు చేయాలని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆల్ ఇండియన్ మెడికల్ ఎక్విప్ మెంట్ అండ్ డ్రగ్ తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో మెడికల్ టెక్నాలజీ పార్కు ఏర్పాటు  కోసం ఏప్రిల్ 8న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారట. 

అంతేకాదు.. గర్భిణుల కోసం ప్రత్యేకంగా అల్ట్రా సౌండ్ స్కానింగ్ ను ఉచితంగా ఆస్పత్రుల్లో అందించే కార్యక్రమాన్ని చేపట్టాలని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ సంచార్ మొబైల్ వ్యాన్లను ప్రవేశపెట్టాలని  కూడా చంద్రబాబు వైద్యారోగ్యశాఖకు సూచించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: