చాలా రోజుల తర్వాత సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఆయన మరోసారి తెలుగు రాష్ట్రానికి వస్తున్నారని ప్రచారం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉన్న సమయంలో జగన్ అక్రమాస్తుల కేసు..ఇతరత్రా వాటిపై సీబీఐ అధికారిగా జేడీ లక్ష్మీ నారాయణ దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో లక్ష్మీనారాయణ చాలా కీలకంగా వ్యవహరించారు. 

పెద్ద పెద్ద తలకాయలు కేసులో ఉన్నా లక్ష్మీనారాయణ ధైర్యంగా కేసును విచారించారని పేరు వచ్చింది. పత్రికల్లో విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది. అంతే కాదు.. ఏపీలోని పలుచోట్ల లక్ష్మీనారాయణ ఫ్యాన్స్ అంటూ కొన్ని పోస్టర్లు వెలిశాయి. ఇక సోషల్ మీడియాలోనూ ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఆయన కూడా అనేక స్కూళ్లు కార్యక్రమాలకు హాజరై విద్యార్థులకు స్ఫూర్తి నింపారు. 

జగన్ అక్రమాస్తుల కేసు చూస్తుండగానే.. ఆయన మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. ఐతే.. ప్రస్తుతం ఏపీ రాజధాని 'అమరావతి' నిర్మాణాన్ని బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలీసు కమిషనర్ గా జేడీ లక్ష్మీనారాయణను నియమించాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆయన మూడేళ్ల పాటు డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చే అవకాశం ఉందంటూ పత్రికలు కూడా వార్తలు రాశాయి. 

ఐతే.. తాను ఏపీకి అందులోనూ అమరావతి కమిషనర్ గా వస్తున్నట్టు వస్తున్న వార్తలన్నీ వదంతులేనని సాక్షాత్తూ లక్ష్మీనారాయణే స్వయంగా వివరణ ఇచ్చారు. ఈ వార్తలు పూర్తిగా సత్యదూరమని, ఏమాత్రం నిజం లేదని ఆయన మీడియాకు తెలిపారు. మంగళవారం నుంచి తనకూ ఈ విషయమై విపరీతంగా ఫోన్లు వస్తున్నాయని దయచేసి ఇలాంటి వదంతులను నమ్మవద్దని లక్ష్మీనారాయణ ఓ ఛానల్ తో మాట్లాడుతూ చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: