అమెరికా, రష్యా, చైనా, యూరప్‌లకు దీటుగా భారత్‌కు కూడా సొంత గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉండాలన్న కల సాకారమయ్యింది. విశ్వ వినువీధులనుంచి మనకు మార్గదర్శకం చేసేందుకు మనదైన నావిగేషన్ వ్యవస్థ ఒక్క నెలలో ఉనికిలోకి రానుంది. అంతరిక్ష, సాంకేతిక పరిశోధన రంగంలో మరో మైలురాయిని అధిగమిస్తూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్) ఏడో ఉపగ్రహం విజయవంతంగా గగన వీధులను చేరుకుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఆరు ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏడోది, చివరిది అయిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీని గురువారం ఇస్రో
విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.  

 

దేశవ్యాప్తంగా ప్రజల్లో విజయగర్వం తొణికిసలాడింది. ఈ ప్రయోగంలో భాగంగా శక్తిమంతమైన రాకెట్‌ను రూపొందించిడానికి పీఎస్‌ఎల్వీ-ఎక్స్‌ఎల్ రకానికి చెందిన ఆరు మోటర్లను ఉపయోగించారు. ఈ రకమైన మోటర్లను మార్స్ ఆర్బిటర్ మిషన్, చంద్రయాన్-1, ఆస్ట్రోశాట్ ప్రయోగాలకు ఐఆర్‌ఎన్‌ఎస్‌కు చెందిన ఆరు రాకెట్లకు ఉపయోగించారు. ఏడు శాటిలైట్ల ప్రయోగం విజయవంతమవ్వడంతో అమెరికా జీపీఎస్ (24 శాటిలైట్లు), రష్యా గ్లోనాస్, యూరప్ గెలీలియో, చైనా బీడూలకు సమాంతరంగా భారత జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు కానున్నది. జపాన్, ఫ్రాన్స్ దేశాలు కూడా సొంత జీపీఎస్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకొనేందుకు సిద్ధమవుతున్నాయి. 

 

ఇస్రోకు అత్యంత నమ్మకమైన అంతరిక్ష వాహనం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్‌ఎల్వీ) సీ-33 రాకెట్ ఈ బృహత్తర యజ్ఞంలో మరోసారి వెన్నుదన్నుగా నిలిచింది. గురువారం మధ్యాహ్నం 12.50 గంటల ప్రాంతంలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్‌పై నుంచి ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ నిప్పులు కక్కుతూ నింగిని చీల్చుకొంటూ నిర్మలమైన ఆకాశంలోకి దూసుకెళ్లింది. ప్రయోగ అనంతరం 20 నిమిషాల తర్వాత ఈ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ పొడవు 44.4 మీటర్లు, బరువు 1.425 కేజీలు. దీని జీవితకాలం 12ఏండ్లు. భారత కీర్తి పతాకాన్ని విశ్వ పరిశోధన రంగంలో రెపరెపలాడించిన ఇస్రో శాస్త్రవేత్తలను రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు తదితరులు అభినందనలతో ముంచెత్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: