గుజరాత్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో కొన్నాళ్లుగా సాగుతున్న పటేల్ వర్గం ఆందోళనలకు తలొగ్గి అగ్రవర్ణాలకూ పది శాతం రిజర్వేషన్ సదుపాయం కల్పించింది. హార్దిక్ పటేల్ కొన్నాళ్లుగా చేస్తున్న ఆందోళనలకు తలొగ్గిన గుజరాత్ అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికీ ఈ రిజర్వేషన్ల కల్పించనున్నట్లు ప్రకటించింది. 

వార్షికాదాయం ఆరు లక్షల కంటే.. తక్కువ ఉన్న అగ్ర కులాల వారికి ఈ రిజర్వేషన్లు వర్తింపజేయాలని గుజరాత్ డిసైడ్ చేసింది. కొంతకాలంగా రిజర్వేషన్ల కోసం గుజరాత్ రాష్ట్రాన్ని పటేల్ వర్గం అట్టుడికిస్తున్న సంగతి తెలిసిందే. హార్దిక్ పటేల్ నేతృత్వంలోని ఈ ఉద్యమం అనేక సార్లు హింసకు దారి తీసింది. మరికొన్నిసార్లు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. 

పంతం నెగ్గించుకున్న హార్దిక్ పటేల్..


ఈ రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు హార్ధిక్  పటేల్ పై ఇప్పటికే పలు కేసులు కూడా ఉన్నాయి. క్రమంగా ఉద్యమం తీవ్రమవుతుండటాన్ని గమనించిన గుజరాత్ సర్కార్ జనరల్ కేటగిరీ నుంచి 10 శాతం రిజర్వేషన్ అగ్రవర్ణ పేదలకు కల్పించింది. అయితే ఈ గుజరాత్ నిర్ణయం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. గుజరాత్ బాటలోనే ఇప్పుడు అనేక రాష్ట్రాలు పయనించే అవకాశం కూడా ఉంది. 

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశ్యంతోనే బీజేపీ హార్దిక్ పటేల్ వంటి నేతలను పెంచి పోషించిందనే విశ్లేషణలు కూడా లేకపోలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లో కోత వేయలేనందున ప్రస్తుతానికి ఆ వర్గాల నుంచి పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అయితే రిజర్వేషన్లకు ఆర్థిక పరిస్థితులు మూలం కాదని సామాజిక వెనుకబాటుతనమే మూలమని గతంలో పలు కేసుల్లో తీర్పులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ నిర్ణయం కోర్టుల్లో చెల్లుతుందా లేదా అన్నది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: