ఒక అబద్దం చెబితే దాన్ని కవర్ చేసుకోవడానికి వంద అబద్దాలు చెప్పాలని అంటారు.. ఇప్పుడు భారత ఒలింపిక్ సంఘం విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ ఏడాది రియోలో జరిగే ఒలింపిక్ పోటీల్లో పాల్గొన్న ఇండియన్ టీమ్ కు గుడ్ విల్ అంబాసిడర్ గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను ఎంపిక చేసుకున్నారు. ఇది కాస్తా వివాదంగా మారింది. 

క్రీడలతో సంబంధంలేని సినిమా స్టార్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎలా ఎంపిక చేస్తారంటూ విమర్శలు ఫుల్లుగా వచ్చేశాయి. చుట్టుముట్టిన విమర్శలతో భారత ఒలింపిక్ సంఘం మేలుకొంది. పరువు నష్టాన్ని నివారించుకునేందుకు చర్యలు ప్రారంభించింది. పోయిన చోటే వెదుక్కోవాలన్నట్టు మరికొందరు ప్రముఖులను అంబాసిడర్ లుగా నియమించాలని డిసైడైయ్యింది. 

అందుకే.. ఒలింపిక్స్‌కు వెళ్లే భారత బృందానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను భారత ఒలింపిక్ సంఘం బతిమాలుకుంటోంది. సచిన్ లాంటి నాన్ కాంట్రావర్షియల్ వ్యక్తి అయితే ఇబ్బంది ఉండదని భావించిన ఒలిపింక్ సంఘం మాస్టర్ పై క్రమంగా ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది. అయితే సచిన్ స్పందన ఏంటన్నది ఇంకా తెలియలేదు. 

ఒక్క సచిన్ తోనే ఆగకుండా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహ్మాన్‌ను కూడా భారత్ నుంచి వెళ్లే బ్రాండ్ అంబాసిడర్ల జట్టులో చేర్చాలని భారత ఒలింపిక్ సంఘం ప్రయత్నిస్తోందట. సినిమాలతో సంబంధం లేని రెహ్మాన్ లాంటి వారని ఎంపిక చేసి సల్మాన్ ఖాన్ ఎంపికను సమర్థించుకునే ఆలోచన కూడా ఒలింపిక్ సంఘం ఎత్తుల్లో కనిపిస్తోంది. ఇంతకూ సచిన్, రెహ్మాన్ ఎలా స్పందిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: