వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఏపీ చరిత్రలో ఆయన తక్కువ కాలమే పాలించినా తనదైన ముద్రవేసుకున్నారు. ప్రత్యేకించి సంక్షేమ పథకాల రూపకల్పనలో ఆయన తర్వాతే ఎవరైనా అనే పేరు తెచ్చుకున్నారు. జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇలా ఎన్నో పథకాలు రూపొందించారు. 

వై.ఎస్. కాలంలో రూపొందించిన సంక్షేమ పథకాల పేర్ల విషయంలో గతంలో చాలా వివాదం నడిచింది. అన్ని పథకాల పేర్లకు ముందు రాజీవో, ఇందిరో, నెహ్రూనో పెట్టడం వైఎస్ సర్కారుకు గతంలో ఓ అలవాటుగా మారింది. దీనిపై అప్పట్లో ప్రతిపక్షాలు రాద్దాంతం చేశాయి. తెలుగు నేలను గర్వింపజేసిన మహానుభావులు లేరా.. ప్రతి దానికీ గాంధీల పేర్లే పెట్టాలా అంటూ విమర్శలు వచ్చాయి. 

ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మరో కొత్త  ట్రెండ్ మొదలైంది. ఇందిర, రాజీవ్ ల స్థానంలో టీడీపీ ఎన్టీఆర్ పేరు పెట్టడం ప్రారంభించింది. పథకాలు కొత్తవి కాకపోయినా కనీసం పేర్లయినా మారుద్దాం అనుకున్నారో ఏమో కానీ ఎన్టీఆర్ సుజల, ఎన్టీఆర్ వైద్య అంటూ చంద్రబాబు ఎన్టీఆర్ జపం ప్రారంభించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేస్తోంది టీడీపీ సర్కారు.

పాపం ఎన్ని పథకాలకు ఎన్టీఆర్ పేర్లు పెడతారు.. అందుకే ఇప్పుడు ఏకంగా చంద్రబాబు పేరే పెట్టేస్తున్నారు. చంద్రన్న కానుక, చంద్రన్న సంచార వైద్య వాహనాలు.. ఇలా చంద్రన్న ట్రెండ్ మొదలైంది. ఈ విషయంలో చంద్రబాబు వైఎస్ కంటే రెండాకులు ఎక్కువే చదివారు. పాపం వైఎస్ ఎంతసేపూ తన పార్టీ నాయకుల పేర్లు పెట్టారే కానీ.. తన పేరు మాత్రం పెట్టుకోలేదు..చంద్రబాబు ఇందుకు భిన్నంగా తన పేరే పెట్టుకుంటున్నారు. దటీజ్ బాబు.. ఏమంటారు..!?



మరింత సమాచారం తెలుసుకోండి: