ప్రస్తుతానికి వైసీపీకి వెరీ బ్యాడ్ టైమ్ నడుస్తోందనే చెప్పుకోవాలి. ఒక రకంగా ఇది జగన్ కు పరీక్షా కాలం లాంటిది. సహనంతో, సంయమనంతో, లౌక్యంతో ఈ గండాన్ని జగన్ గట్టెక్కాల్సి ఉంటుంది. కానీ ప్ర్తస్తుతానికి అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారి విషయంలో జగన్ పెద్దగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపించడంలేదు. 

వెళ్లిపోతే పోయారు. అయితే ఏంటి అన్న దృక్పథకం కనిపిస్తోంది. మైసూరా పార్టీ వీడుతున్నారుగా అని విలేఖరులు అడిగితే.. ఆయన్ను చూసి ఆరు నెలలుదాటింది అంటూ నిర్లక్ష్యంగా జగన్ చెప్పిన సమాధానమే ఆయన వైఖరికి ఓ ఉదాహరణగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి వలసలు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఐతే.. ఈ వలసలు మరింత జోరుగా ఉంటాయని అధికార పక్షమైన టీడీపీ చెబుతోంది. 

వైఎస్ జగన్  వైఖరితో వేగలేకనే ఆ పార్టీ నుంచి నాయకులు తమ వైపు వస్తున్నారన్నది టీడీపీ నేతల వాదన. వైసీపీ నుంచి తాము నేతలను కొనుగోలు చేస్తున్నామన్న జగన్ వాదనలో ఏమాత్రం వాస్తవం లేదని అంటున్నారు టీడీపీ మంత్రులు. అసలు తమకు అలాంటి అవసరమే లేదంటున్నారు. అంతే కాదు.. చివరికి జగన్ సోదరి షర్మిల కూడా ఆయన పార్టీలో ఉండరని మంత్రి పల్లె రఘునాథరెడ్డి కామెంట్ చేశారు. 

మంత్రి పల్లె రఘునాథరెడ్డి కామెంట్లు ఆసక్తికరంగా ఉన్నాయి. వాస్తవంగానే షర్మిల వైసీపీని వీడే పరిస్థితి వస్తుందా.. అలాంటిదే జరిగితే జగన్ ఇమేజ్ మరింతగా డ్యామేజ్ కావడం ఖాయం. ఏదో సైకలాజికల్ ఎఫెక్ట్ కోసం టీడీపీ మంత్రులు ఇలాంటి ప్రకటనలు చేయొచ్చు కానీ వాస్తవంగా ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ షర్మిల కూడా కొంతకాలంగా వైసీపీలో యాక్టివ్ గా లేకపోవడం గమనార్హం. అయితే అంత మాత్రాన ఆమె వైసీపీని వదలి బయటకు వస్తారని చెప్పలేం. 



మరింత సమాచారం తెలుసుకోండి: