ఏపీలో వైసీపీ, టీడీపీ ఎలా కత్తులు దూసుకుంటున్నాయో అందరికీ తెలిసిన విషయమే. అసలు వైసీపీనే లేకుండా చేయాలని టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించడంలో బిజీబిజీగా ఉంది. ఆ ప్రయత్నాలు చాలావరకూ ఫలిస్తున్నాయి. ఇప్పటికి దాదాపు 16 మంది వరకూ వైసీపీ నుంచి జంప్ చేసారు. మరోవైపు బాబు అవినీతిపై జగన్ డిల్లీ స్థాయిలో పోరు చేస్తున్నారు. 

ఐతే ఆశ్చర్యంగా చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఓ విషయంలో చేతులు కలిపారు. వీరిద్దరేనా.. వీరికి కాంగ్రెస్ నేత సోనియా గాంధీ కూడా జతకలిపారు.. ఏ విషయంలో అంటారా.. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక విషయంలో. ఇక్కడ దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి భార్య సుచరిత రెడ్డి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. 

ఐతే.. సుచరితకు టీడీపీ, వైసీపీ పార్టీలు మద్దతు ఇచ్చాయి. సిటింగ్ ఎమ్మెల్యే మరణించినప్పుడు వారి కుటుంబానికి ఎన్నికయ్యే అవకాశం ఇవ్వాలన్న నిర్ణయం మేరకు ఈ రెండు పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో కాంగ్రెస్ తన ప్రచారంలో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. ప్రత్యేకించి సుచరిత పోస్టర్లలో ప్రముఖ నేతలంతా బారులు తీరుతున్నారు. 

సుచరిత ఎన్నికల పోస్టర్లలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, వెంకటరెడ్డి తదితరుల కాంగ్రెస్ నేతల ఫోటోలతో పాటు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ అధ్యక్షుడు జగన్, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటోలు ముద్రించారు.

అంతేకాదండోయ్.. టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఖమ్మం వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటోలను ప్రముఖంగా ముద్రించారు. నిజంగా ఇంతంటి వెరైటీ పోస్టర్ ఇంతకముందు చూడలేదు..ఇక ముందు కూడా చూడబోం. కాదంటారా..!?



మరింత సమాచారం తెలుసుకోండి: