శంకరమఠం ఆడిటర్ రాధాకృష్ణన్‌పై జరిగిన దాడి కేసులో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి నిర్దోషిగా విడుదలయ్యారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం స్వామి జయేంద్ర సరస్వతి తదితర 9 మంది కోర్టుకు హాజరయ్యారు. కంచి స్వామిపై తీర్పు వెలువడుతున్న కారణంగా పెద్ద సంఖ్యలో ఆయన శిష్యులు, భక్తులు కోర్టుకు చేరుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ స్వామి సహా మొత్తం 9 మంది నిందితులను కోర్టులోకి ప్రవేశపెట్టారు. ప్రభుత్వం తరపున సరైన సాక్ష్యాధారాలు లేనికారణంగా స్వామి సహా 9 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

 

 చెన్నై మందవెల్లికి చెందిని పారిశ్రామికవేత్త రాధాకృష్ణన్, అతని భార్య జయశ్రీ, పనిమనిషి కృష్ణన్ ఇంటిలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు జొరబడి దాడికి పాల్పడ్డారు. 2002 అక్టోబరు 20వ తేదీన చోటుచేసుకున్న ఈ సంఘటనపై పట్టినంబాక్కం పోలీసులు హత్యాయత్నంగా కేసు నమోదు చేశారు. చెన్నై నాల్గవ అదనపు సెష న్స్ కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో కంచిస్వామి జయేంద్ర సరస్వతి, సుందరేశ అయ్యర్, రఘు, రవి సుబ్రమణ్యం తదితర 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.


ఆ తరువాత చార్జిషీటు దాఖలు చేశారు. నిందితుల్లోని సుబ్రమణ్యం అప్రూవర్‌గా మారి పోలీస్ శాఖకు సహకరించాడు. నిందితుల్లోని అప్పు, కదిరవన్ తదితరులు మృతి చెందగా మిగిలిన 9 మందిపై కేసు విచారణ కొనసాగింది. పోలీసుల తరఫున 55 మంది సాక్ష్యం చెప్పారు. 220 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో తమ తరఫు వాదనను వినిపించేందుకు కంచిస్వామితోపాటూ 9 మంది గత నెల 28వ తేదీన కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో ప్రశ్నిస్తున్న సమయంలో ఆరోపణలు నిరాకరిస్తూనే అనేక సార్లు కంచి స్వామి కంటతడి పెట్టారు. ఇరుపక్షాల వాదనను న్యాయమూర్తి రాజమాణిక్యం తీర్పును ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: