తెలంగాణ ఆవిర్భావం తర్వాత దేశంలో మరోసారి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంటోంది. అయితే ఇదేదో కొత్త ఉద్యమం కాదు.. పాతదే.. మరీ చెప్పాలంటే తెలంగాణ కంటే పాత ఉద్యమం. దశాబ్దాల తరబడి సాగుతున్న ఉద్యమం. అదే విదర్భ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం
 
ఇటీవలి కాలంలో పెద్దగా వార్తల్లో లేని ఈ ఉద్యమం తాజా హింసతో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ తో మహారాష్ట్రలోని యవత్ మాల్ లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలు, విధ్వంసానికి దారి తీశాయి. విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్ తో రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు.. రోడ్లపై వాహనాలను నిలిపివేశారు.

మహారాష్ట్ర రోడ్డు రవాణ సంస్థకు చెందిన అనేక బస్సులపై రాళ్లు, కర్రలతో వారు దాడులకు దిగారు. ఆందోళనకారులు  జరిపిన దాడుల్లో అనేక బస్సుల అద్దాలు పగిలి ధ్వంసమయ్యాయి. దశాబ్దాల తరబడి  ప్రత్యేక విదర్భ కోసం డిమాండ్  చేస్తున్న ఆందోళనకారులు రాష్ట్ర ఏర్పాటే తమ సమస్యలకు పరిష్కారం చూపగలదని చెబుతున్నారు.

విదర్భ తెలంగాణలాగానే పెద్ద భూభాగం.  ఇది మహారాష్ట్ర యొక్క మొత్తం ప్రాంతంలో 31.6% ఆక్రమించింది.  మొత్తం జనాభాలో  విదర్భ జనాభా 21.3%.  మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు భిన్నమైన తన స్వంత ఘనమైన సాంస్కృతిక మరియు చారిత్రక నేపధ్యాన్ని  విదర్భకు ఉన్నాయి.

భారతదేశంలోని ఇతరప్రాంతాలతో పోల్చినపుడు ఈ ప్రాంత రైతులు దయనీయమైన స్థితిలో జీవిస్తున్నారు. ఒక దశాబ్దంలో మహారాష్ట్రలోని 32,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, వారిలో 70% విదర్భ ప్రాంతంలోని 11 జిల్లాలకు చెందినవారే.  ఐతే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంపై రాజకీయ పార్టీల్లో ఏకాభిప్రాయం లేదు. అంతేకాదు.. మహారాష్ట్రలోని కీలకమైన శివసేన ప్రత్యేక విదర్భ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: