ఒబామా.. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం అమెరికాను ఊపేసిన పేరు.. ఒబామా పేరు చెబితే చాలు.. పిల్లా,పెద్దా, కుర్రకారు అంతా జయజయధ్వానాలు కొట్టేవారు.. మార్పు తెస్తానంటూ అమెరికా ప్రెసిడెంట్ బరిలో దిగి అపూర్వ విజయం సాధించాడు. రెండోసారి కూడా అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఇప్పుడు మరికొ్న్ని నెలల్లో పదవి నుంచి దిగిపోతున్నాడు. 

ఐతే.. పదవిలో ఉన్నా లేకపోయినా ఒబామాలోని సెన్స్ ఆఫ్ హ్యూమర్ మాత్రం అలాగే ఉంది. తాజాగా ఆయన తన శ్వేత సౌధంలో ప్రముఖులకు ఇచ్చిన విందులో ఆయన ఎతో జోవియల్ గా కనిపించారు. కనిపించిన అందరిపైనా జోకులు వేశారు. చివరకు తనపై కూడా తాను భలేగా జోకులు వేసుకుని నవ్వించారు. అందుకే ఒబామాను  ఉల్లాసానికి మారు పేరు అంటారు. 

ఒబామా డెమోక్రాట్‌ అభ్యర్ధి హిల్లరీ పేరు ఎత్తకుండానే ప్రెసిడెంట్ గా ఓ లేడీ రాబోతోందటూ కామెంట్ చేశాడాయన. వచ్చే ఏడాది ఈ సమయానికి ఈ ప్రదేశంలో మరెవరో  ఉంటారు. ఆమె ఎవరో ఎవరైనా ఊహించుకోవచ్చు. హిల్లరీ మొండితనం, పనిలో అందం,  విధానాల్లో సమర్ధత, ఆమె అనుభవం గురించి నేను ఇప్పటికే చెప్పాను. ఆమె పని తీరును మీరు ఒప్పుకుని తీరాలి...అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు.

మరో ప్రెసిడెంట్ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ పై ఘాటు కామెంట్లు చేశారు ఒబామా... ట్రంప్ తమ అభ్యర్ధి కాబోతున్నారంటే రిపబ్లికన్‌ పార్టీ వారే నమ్మలేకపోయారు.  వారు దిగ్భ్రాంతికి గురయ్యారు.  దేశానికి అధ్యక్షుడు కావాల్సిన విదేశాంగ అనుభవం ట్రంప్‌కు లేదని వారి అభిప్రాయం.. అంటూ చురకలు వేశారు. మిత్రులు, రాజకీయ ప్రత్యర్ధులే కాదు.. చివరకు తనపై కూడా తానే జోకులేసుకున్నారు. 

ఎనిమిదేళ్ల క్రితం నేను చాలా యవ్వనంగా ఉండేవాడిని. జీవితం అంటే తెలిసిన వాడిగా, ఆదర్శవాదంతో పాటు ఒకింత గర్వంగా ఉండేవాడిని. నన్ను ఇప్పుడు చూస్తే  రంగు వెలసిపోయినట్లు కనిపిస్తున్నాను. మరణశయ్య మీదకు ఎక్కేందుకు రోజులు లెక్కపెట్టుకుంటున్నాను.. అంటూ ఒకింత నిర్వేదంగా మాట్లాడారు ఒబామా.. 



మరింత సమాచారం తెలుసుకోండి: