ఇప్పటికే వలసలతో ఇబ్బందిపడుతున్న జగన్ పార్టీకి ఇప్పుడు మరో భారీ షాక్ తగిలింది. ఏకంగా ఆ పార్టీకి చెందిన ఓ రాష్ట్ర అధ్యక్షుడు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశాడు. తెలంగాణలో ఆ పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎంపీ, తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైసీపీ వీడి టీఆర్ఎస్ లో చేరిపోవాలని నిర్ణయించేసుకున్నారు. 

అయితే ఇది అనూహ్య నిర్ణయమేమీ కాదు. పొంగులేటి పార్టీ మారవచ్చని గతంలోనే వార్తలు వచ్చాయి. దాదాపు నెల రోజుల క్రితం ఏకంగా పార్టీ మీటింగ్ లో కిందిస్థాయి కేడర్ ఈ విషయంపై పొంగులేటిని నిలదీశారు కూడా. అయితే అబ్బే అలాంటిదేమీ లేదని అప్పుట్లో పొంగులేటి కొట్టిపారేశారు. ఇప్పుడు జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ గులాబీ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. 

కొన్నిరోజులుగా పార్టీ మారే విషయంపై తర్జనభర్జన పడుతున్న పొంగులేటి.. తన అనుచరులతో ఖమ్మంలో సమావేశం అయ్యారు. చివరకు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఖమ్మం అభివృద్ది కోసమే తాను పార్టీ మారబోతున్నానని ఆయన తేల్చి చెప్పేశారు. పొంగులేటితో పాటు మరో ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ లో చేరిపోతున్నారు. వీరితో పాటు మరికొందరు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలూ పార్టీ మారిపోతున్నారు. 

రాష్ట్ర అధ్యక్షుడే పార్టీ మారిన తర్వాత ఇక ఆ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదనే చెప్పాలి. ఇప్పటివరకూ రెండు రాష్టాల్లో ఉన్న వైసీపీ ఇక పూర్తిగా ఆంధ్రా పార్టీగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా ఖమ్మంలో పాలేరు ఉప ఎన్నిక నేపద్యంలో పొంగులేటి చేరిక టీఆర్ఎస్ కు కీలకమైన ప్లస్ పాయింట్ కానుంది. అంతే కాదు.. పొంగులేటి ఏకంగా పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయమని లేఖ ఇచ్చే అవకాశం కూడా ఉందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: