కొమ్మినేని శ్రీనివాసరావు.. తెలుగు నాట పరిచయం అక్కర్లేని జర్నలిస్టు. మొదట ఈనాడు, ఆ తర్వాత టీవీ5, ఎన్టీవీల్లో పని చేసిన కొమ్మినేని ప్రస్తుతం ఎన్టీవీలో గౌరవ చీఫ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఆయన నిర్వహించే ఉదయం లైఫ్ షో చాలా ఫేమస్. ఐతే.. ఆయన టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. జగన్ అనుకూలంగా వాదిస్తుంటారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటారు. 

ఇప్పుడు అధికారం అండ చూసుకుని కొమ్మినేని లైవ్ షో ఆపేస్తారా.. ఆంధ్రాలో ఎన్టీవీ ఆపేయమంటారా అంటూ టీడీపీ సర్కారు హుకుం జారీ చేసింది. దాంతో ఎన్టీవీ కొమ్మినేని లైవ్ షోను ఉన్నట్టుండి ఆపేసింది. కొన్నాళ్లుగా ఈ పరిణామంపై నోరుమెదపని కొమ్మినేని తాజాగా తన వాదన వినిపించారు. మిత్రులకు రాసిన వివరణ లేఖలో చంద్రబాబు సర్కారు పేరు ప్రస్తావించకుండా ఎన్టీవీని టీడీపీ సర్కారు ఎలా బెదిరిస్తుందో వివరించారు. 

బాబు గుట్టు విప్పిన కొమ్మినేని.. 


కొమ్మినేని లేఖ పూర్తి పాఠం...

ఎన్.టి.వి లో రోజూ ఉదయం వచ్చే కెఎస్ ఆర్ లైవ్ షో లో ఎందుకు మీరు కనిపించడం లేదని చాలామంది అడుగుతున్నారు. నిజమే. నేను ఆ షో చేయలేకపోవడానికి ప్రధానంగా రాజకీయాలే కారణం. సహజంగానే అదికారంలోకి వచ్చిన కొందరు పెద్దలు తమ ప్రభావం చూపాలని అనుకున్నారు. అందులో భాగంగానే నన్ను ఆ షో నుంచి తప్పించాలని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వత్తిడి చేశారు. ప్రజాస్వామ్యంలో అన్ని అభిప్రాయాలకు అవకాశం ఉంటుందని నమ్మేవారిలో నేను ఒకడిని, నాకుగా నేను తెలిసి ఎవరికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో వ్యవహరించాలని అనుకోను. ఎప్పుడైనా పొరపాట్లు జరిగితే జరిగి ఉండవచ్చు.కాని నిజాయితిగా, నిర్మొహమాటంగా ,నిష్పక్షపాతంగా ఉండాలన్నదే నా అభిప్రాయం.

అందుకు అనుగుణంగానే టివీ డిబేట్ లు ఉండాలన్నది నా లక్ష్యం .అందువల్ల పలు సమస్యలు వచ్చే మాట వాస్తవమే. అయినా వాటిని తట్టుకుని ముందుకు సాగాలి.కాని ప్రభుత్వాలకు ఉండే అపరిమితమైన అదికారబలం ముందు వ్యక్తులు నిలబడడం కష్టం.అదే సమయంలో ఒక వ్యక్తి కోసం సంస్థలు దెబ్బతినరాదని నేను భావిస్తాను. వందల మంది ఆధారపడే సంస్థలు బాగుండాలి. అందుకే నేను ఎన్.టి.వి నుంచి తప్పుకోవడానికి సిద్దమయ్యాను.లేకుంటే ఇప్పటికే ఒకసారి మూడు నెలలపాటు ఎపిలో టీవీని బంద్ చేశారు. మళ్లీ నా కారణంగా టీవీ ఆగిపోయే పరిస్థితి రాకూడదు. 

ఆ ఉద్దేశంతో బాధ్యతల నుంచి తప్పుకోవడానికి నిర్ణయించుకున్నాను. కాని ఎన్.టి.వి యాజమాన్యం, చైర్మన్ చౌదరి గారు నా పట్ల సహృదయతతో, గౌరవంతో అందుకు ఒప్పుకోలేదు. దాంతో కొంతకాలం టీవీ షో నుంచి తప్పుకోవాలని అనుకున్నాము.కొద్ది కాలం తర్వాత పరిస్థితులు మారతాయని,అప్పుడు తిరిగి షో చేయాలని అనుకున్నాము.ఆ క్రమంలో నేను కొంత కాలం యాజమాన్యం సహకారంతోనే కెనడా వెళ్లి వచ్చాను.అయితే తిరిగి వచ్చాక కూడా ఇంకా సమస్య ఒక కొలిక్కి రాలేదు.సంప్రదింపులు జరుగుతున్నాయని  యాజమాన్యం వారు చెప్పారు.

మళ్లీ ఉద్యోగం నుంచి తప్పుకుంటానని,సంస్థ నా వల్ల ఇబ్బంది పడవద్దని యాజమాన్యానికి తెలిపాను.కాని వారు అంగీకరించలేదు.మరికొంత సమయం ఇవ్వాలని కోరారు.దాంతో నేను కూడా మరీ మొండిగా ఉండరాదన్న ఉద్దేశంతో యాజమాన్యం నా పట్ల చూపిన ఆదరణకు కృతజ్ఞతగా ఉండాలని భావించాను. బహుశా మరి కొంతకాలం షో లోకి రాలేకపోవచ్చని అనుకుంటున్నాను.ఒకందుకు సంతోషంగా ఉంది. నేను ఎక్కడా ఆత్మ గౌరవాన్ని వదలుకోలేదు.ప్రజల పక్షాన,ఎవరు తప్పు చేసినా మాట్లాడే బాట నుంచి వైదొలగలేదు.

నా అబిప్రాయాలు కొందరికి నచ్చకపోవచ్చు.కాని ఒక జర్నలిస్టు చేసే వ్యాఖ్యలకే ప్రభుత్వంలో అగ్ర స్థానంలో ఉన్నవారు భయపడతారా అనుకునే వాడిని.వాడి ఉద్యోగం తీయించుతారా అని అనుకుంటుండేవాడిని.కొందరు గొప్ప జర్నలిస్టులకు ఎదురైన అనుభవాలు తెలుసు.నిజానికి నేను అంత గొప్పవాడినేమీ కాదు.ఆ విషయంలో నాకు స్పష్టత ఉంది.కాని నేను ఎక్కడా రాజీపడకుండా ఉద్యోగం పోగొట్టుకోవడానికి కూడా సిద్దపడి నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను.అలాగే ఒక పార్టీ పట్ల అబిమానమో, ద్వేషమో లేవు. వ్యక్తులపై ఎలాంటి అగౌరవం లేదు. పరిస్థితులు మారతాయని, అధికారంలో ఉన్నవారు ప్రజాస్వామ్య విలువలకు ఎప్పటికైనా గౌరవం ఇస్తారని ఆశిస్తున్నాను.



మరింత సమాచారం తెలుసుకోండి: