విగ్రహాలను గత స్మృతులుగా తలుస్తాం.. చరిత్రగతిని మార్చినవారికి.. చరిత్ర పుటల్లో స్థానం సంపాదించినవారికి.. వారిని నిత్యం స్మరించుకునేందుకు విగ్రహాలు పెడుతుంటారు. సాధారణంగా ఈ విగ్రహాలు దివంగతులైన వారికి మాత్రమే ఎక్కువగా పెడుతుంటారు. వారి జయంతులు, వర్థంతులు, ప్రత్యేక కార్యక్రమాల సమయంలో వారి సేవలు గుర్తు చేసుకుంటుంటారు. 

కానీ ఇప్పుడు తెలుగు నేలలో కొత్త సంస్కృతి ప్రారంభమైంది. మొన్నటికి మొన్న అమరావతి శంకుస్థాపన సందర్భంగా చంద్రబాబుకు గుడి కట్టిస్తున్నామని ఓ నాయకుడు ప్రకటించారు. చంద్రబాబు విగ్రహాన్ని తయారు చేయించారు. ఇప్పుడు ఈ సంస్కృతి తెలంగాణకూ పాకింది. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ విగ్రహాలు రెడీ అవుతున్నాయి. ఔను.. మీరు చదువుతున్నది నిజమే.. కేసీఆర్ కు విగ్రహం పెట్టబోతున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అపర కాటన్ గా పేర్కొంటూ, కొత్తగా తలపెట్టిన ప్రాజెక్టుల వద్ద ఆయన విగ్రహాలను పెడతారట. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద పెట్టేందుకు ఓ విగ్రహాన్ని తయారు చేయించారు. కరీంనగర్ జిల్లా మంథని ఎమ్మెల్యే పుట్టా మధు ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. గోదావరిపై కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మాణం ద్వారా అపర కాటన్ గా మారిన కెసిఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన అంటున్నారు. 

ఇప్పటికే కేసీఆర్ విగ్రహం దాదాపు పూర్తయింది. ఇక ఫినిషింగ్ టచ్ ఇచ్చి.. కొద్ది రోజులలో కాళేశ్వరం వద్ద ఉంచుతారట. ఈ సంస్కృతి కొనసాగితే.. ఇక తెలంగాణలో ఏర్పాటుకాబోయే ప్రతి అభివృద్ధి పనుల వద్దా కేసీఆర్ విగ్రహాలు కనిపిస్తాయేమో. బతికుండగానే పెద్ద ఎత్తున విగ్రహాలు ఉన్న నేతగా కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారేమో.. చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: