అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని ఏపీ కలలు కంటోంది. దీన్ని ఓ జీవిత కాల అవకాశంగా భావించిన చంద్రబాబు ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని కట్టాలన్న ధృఢ నిశ్చయాన్ని పలుసార్లు ప్రకటించారు. అందుకుతగ్గట్టుగానే చర్యలు తీసుకుంటున్నారు. కళ్లు చెదిరే కట్టడాలు, భవనాలు లేనిదే పర్యాటకంగా అభివృద్ధి ఉండదన్నభావనతో ఐకానిక్ భవనాలు రూపొందించాలని నిర్ణయించారు. 

ఈ భవనాల డిజైన్ల కోసం కూడా అంతర్జాతీయ స్థాయిలో పోటీ నిర్వహించారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలు పోటీపడిన నేపథ్యంలో వాటిని ఓ నిపుణుల కమిటీ పరిశీలించి చివరకు జపాన్ కు చెందిన మాకీ సంస్థ ఇచ్చిన డిజైన్ అద్భుతంగా ఉందని తేల్చింది. ఐతే.. ఈ కంపెనీ ఇచ్చిన నమూనాను ఎలా ఆమోదించారనే విషయం అప్పట్లోనే ఈ తంతు గమనించినవారికి అర్థం కాలేదు. 

విమర్శల పాలైన జపాన్ కంపెనీ డిజైన్.. 


వాస్తవానికి మాకీ ఇచ్చిన డిజైన్లు చాలా చెత్తగా ఉన్నాయి. వాటిలో కొన్ని బిల్డింగులైతే మన థర్మల్ పవర్ స్టేషన్లలోని కూలింగ్ టవర్ల తరహాలో ఉన్నాయి. ఈ తలతిక్క డిజైన్లను ఎలా సెలెక్ట్ చేసార్రా బాబూ అని ఆ నమూనాల ప్రదర్శనకు హాజరైన జర్నలిస్టులు కొందరు అప్పుడే పెదవి విరిచారు. మాకీ డిజైన్ల కన్నా కొన్ని ఇండియన్ కంపెనీలు ఇచ్చిన డిజైన్లు కాస్త మెరుగు. 

ఐతే.. మొత్తానికి జపాన్ కంపెనీ కాంట్రాక్టు అప్పగించిన తర్వాత ఇప్పుడు తీరిగ్గా ఏపీ సర్కారు కళ్లు తెరుచుకుంటోంది. డిజైన్లపై విమర్శలు వస్తున్నాయని గ్రహించిన సర్కారు పునరాలోచనలో పడింది. వీటిని మళ్లీ మార్చాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు డిసైడ్ చేశారట. ఆ మేరకు జపాన్ కంపెనీకి తేల్చిచెప్పారట. చివరకు భారత్ కు చెందిన పలువురు ఆర్కిటెక్ట్ లతో సమావేశం జరిపి దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అందుకేనేమో  పొరుగింటి పుల్లకూర రుచి అంటారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: