తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ సెంట్రల్ నాయుడు, స్టేట్ నాయుడు కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. టీడీపీ, బీజేపీ నేతలు టీవీల్లో తిట్టుకునే డ్రామాలు ఆపాలన్నారు. మరి కొద్ది రోజులు ఎదురుచూసి హోదా కోసం పోరాడుతామని చంద్రబాబు చెప్పడం చచ్చే దాకా ఉంటె నీ పెళ్లి చేస్తా అన్నట్టు ఉందని అన్నారు. ఐదేళ్ళు కాదు పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలన్నా వెంకయ్య నాయుడు ఇప్పుడెం చేస్తున్నారని ప్రశ్నించారు. పోరాటాల ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యమని వైసీపీ ఉద్యమ బాట పడితే చంద్రబాబు ప్రభుత్వం అణచివేసేందుకు ప్రయత్నించిందన్నారు. చంద్రాబాబు స్వార్థ ప్రయోజనాల కోసం కాకుంటే మరెందుకు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ మంత్రులను కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు.

 

వరసబెట్టి టీడీపీ తమ పార్టీ ఎమ్మెల్యే లను కొంటున్నా, ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి ఉన్నా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు తో కలిసి పోరాడేందుకు తాము సిద్ధమన్నారు. ప్రత్యేక హోదా కోసం తామి ఢిల్లీ వచ్చేందుకు సిద్ధమని అక్కడే తేల్చుకోవాలని అన్నారు. కావేరి జలాల కోసం తమిళనాట అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాదాయని దాన్ని చూసైనా చంద్రాబాబు తన వైఖరి మార్చుకోవాలన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటె వైసీపీ తో పాటు ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని ఢిల్లీ బయలుదేరాలని డిమాండ్ చేశారు.

 

ప్రజలకోసమే కేంద్రంలో ఉన్నామంటున్న చంద్రబాబు ఇప్పటివరకు టీడీపీ బీజేపీ స్నేహం వల్ల ప్రజలకు ఏం లాభం కలిగిందని అయన ప్రశ్నించారు. వెంటనే కేంద్రం నుంచి బయటకు రావడంతో పాటు ఎపీలోని బీజేపీ మంత్రులను బయటికి పంపాలని అంబటి డిమాండ్ చేశారు. వెంకయ్య, చంద్రబాబు పరస్పరం పోగుడుకోవడం తప్ప ఏం సాధించారని నిలదీశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: