రాష్ట్ర పునర్విభజనతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న ఏపీకి కేంద్రం నుంచి సహకారం అందడం లేదు. విభజన చట్టంలో పేర్కొన్న పదో షెడ్యూల్ లోని సంస్థల విభజనకు అటు కేంద్రంతో పాటు ఇటు పొరుగు రాష్ట్రం తెలంగాణ కూడా సహకరించడం లేదు. ఈ సంస్థల విభజన అంశం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఇటీవలే కోర్టు ఏపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అమలైతే... పదో షెడ్యూల్ లోని సంస్థల విభజన పూర్తి కావడంతో పాటు సదరు సంస్థల్లోని నిధుల లభ్యతతో ఏపీకి కాస్తంత ఊరట లభించే అవకాశాలున్నాయి.


ఈ క్రమంలో ఈ దిశగా చర్యలను ఏపీ సర్కారు వేగవంతం చేసింది. ఇందులో అడ్వొకేట్ జనరల్ పాత్ర కీలకం. రాష్ట్ర విభజన తర్వాత పరాంకుశం వేణుగోపాల్ ను ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అడ్వొకేట్ జనరల్ గా నియమించారు. ప్రభుత్వం తరఫున పలు కీలక కేసుల్లో సమర్థవంతంగా వాదనలు వినిపించిన వేణుగోపాల్ నిన్న చంద్రబాబు సర్కారుకు షాకిచ్చారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్(ఏజీ) పరాంకుశం వేణుగోపాల్ తన పదవికి ఆదివారం రాజీనామా చేశారు. ఏజీ పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) పోసాని వెంకటేశ్వర్లు స్వయంగా వచ్చి తనను కోరడంతో రాజీనామా చేసినట్టు వేణుగోపాల్ చెప్పారు. గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులనుద్దేశించి తాను రాసిన రాజీనామా లేఖను పోసాని తీసుకెళ్లారని వివరించారు. ‘‘పోసాని వెంకటేశ్వర్లు ఆదివారం ఉదయం నా కార్యాలయానికి వచ్చారు. 15 నిమిషాలపాటు నా కార్యాలయంలో ఉన్నారు. ప్రభుత్వం నన్ను మార్చే యోచన చేస్తోందని, ఈ విషయాన్ని నాతో చెప్పడానికి ఇబ్బందిపడుతోందని, అందువల్ల తనను పంపిందని పోసాని అన్నారు.

ఆ వెంటనే గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఉద్దేశించి రాజీనామా లేఖ రాశాను. దానిని పోసాని చూసి.. రాజీనామాకు కారణాలు రాయాలని కోరారు. అయితే రాజీనామా చేసేందుకు నాకు ఎటువంటి కారణాలు లేవు కాబట్టి నేను కారణాలేవీ రాయలేదు. పైగా ఏజీ పదవిని నిర్వర్తించడం ఎంతో గౌరవమైన విషయం. కాబట్టి నా రాజీనామాకు కారణాలు లేవు. పోసాని అడిగారు.. నేను రాజీనామా చేశా’’ అని వేణుగోపాల్ వివరించారు. వేణుగోపాల్ 2014, జూన్ 19న రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో అడ్వొకేట్ జనరల్ పదవిని ఖాళీగా ఉంచడం ఏపీ సర్కారుకు ఇబ్బందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే కొత్త అడ్వొకేట్ జనరల్ ను నియమించుకోవాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: