తెలంగాణ తెదేపా నేత రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఓటుకు నోటు కేసులో ఇరికించిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే, అంతకుముందు నుండే రేవంత్ రెడ్డి కేసీఆర్ పై, టీఆర్ఎస్ పార్టీ ని భీభత్సంగా విమర్శించేవారు. అయితే ఈయన విమర్శలకు చెక్ పెట్టి ఆయనను ఎలాగైనా ఇరికించాలనే కుతూహలంతో ఉన్న కేసీఆర్ ఆయన్ని ఓటుకు నోటు కేసులో ఇరికించి ఇరకాటంలో పడేసారు కేసీఆర్, ఇక అప్పటినుండి రేవంత్ రెడ్డి పార్టీపై, కేసీఆర్ పై విపరీతంగా విమర్శలను గుప్పిస్తునే వస్తున్నారు. ఇప్పుడు ఆయన తనయుడు కేటీఆర్ పై విమర్శలను ఎక్కుపెడుతూ కొడుకు సేల్ఫీ లూ తీస్తుంటే, తండ్రి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారని ఆసక్తికర కామెంట్ చేశారు.

 

కంటి ముందు అభివృద్ధి.. ఇంటిముందు అభ్యర్థి అని ఆర్భాటపు ప్రకటనలతో ప్రజలను నమ్మించి బల్దియా ఎన్నికల్లో 99 సీట్లు గెలిచిన టీఆర్‌ఎస్ నాయకులు ఆపత్కాలంలో ప్రజలను విస్మరించారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం టీడీపీ హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో జరిగిన మినీమహానాడుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగిస్తూ, ఇటీవలి గాలివానలకు భారీ హోర్డింగుల కూలినా, రోడ్లు దెబ్బతిన్నా,నాలుగు రోజులైనా కరెంటు రాకున్నా, ప్రజా జీవనం అస్తవ్యస్తమైనప్పటికీ ఏ ఒక్క మంత్రి కూడా ప్రజల వద్దకు రాలేదని దుయ్యబట్టారు.

 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హస్‌కు, ఆయన కొడుకు అమెరికాకు పారిపోయారని ఎద్దేవా చేశారు. యాపిల్ సంస్థ సీఈవో నగరానికి వచ్చిన సందర్భంగా కొడుకు సెల్ఫీలతో, తండ్రి సెల్ఫ్ డబ్బాతో డంబాలు పలికినా పెద్ద ప్రాజెక్టు మాత్రం బెంగళూరుకు వెళ్లిందన్నారు. నగరంలో 300 అడుగుల భారీ జాతీయ పతాకంతో సహ అమలు కాని ఆర్భాటపు ప్రకటనలతో ప్రజలను మభ్య పెడుతూ కేసీఆర్ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: