అరక్షణంలోనే అల్లకల్లో లం! కండ్లు మూసి తెరిచేలోపే దడ పుట్టించే దుర్ఘటన! పిల్లలను ఉన్నత విద్యలో చేర్పించి ప్రయోజకులను చేయాలని ఆశపడ్డ ఇద్దరు ప్రాణస్నేహితుల కల నెరవేరలేదు! రాజధానిలో చదివేందుకు బయలుదేరిన ఇద్దరు పిల్లల భవిష్యత్ బలైంది! తాత దగ్గరకెళ్తానని మారాం చేసి చివరిక్షణంలో కారెక్కిన మరో బాలుడు.. మొత్తం ఐదుగురు రెప్పపాటులో మృత్యుఒడికి చేరారు.


జాతీయ రహదారిపై వాయువేగం తో వెళ్తున్న రెండు లారీల మధ్యకు వాయవేగంతో వచ్చిన కారు నామరూపాలు కోల్పోయిన దుర్ఘటన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి బైపాస్‌రోడ్డలో టేక్రియాల వద్ద జరిగింది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్‌కు చెందిన గాదె ప్రవీణ్‌కుమార్(38), అతని కూతురు నిఖిత(18), కొడుకు భరత్(15), ఆర్మూర్ మండలం ఆలూర్‌కు చెందిన యంసాని లక్ష్మణ్‌కుమార్(40), అతని కొడుకు హర్షవర్ధన్(16) ప్రమాదంలో అసువులు బాసారు. సమీపంలోని ఓ హోటల్ వద్ద సీసీటీవీలో ఈ ప్రమాదం రికార్డయ్యింది. ఈ దృశ్యాలను టీవీల్లో చూసిన ప్రజలు సైతం కన్నీరుపెట్టారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.


ప్రమాదం పూర్తిగా కారు నడుపుతున్న వ్యక్తి తప్పిదం వల్లే జరిగిందని సీసీటీవీ ఫుటేజీలో స్పష్టమవుతున్నది. లారీని ఓవర్‌టేక్ చేయడంతోపాటు అటువైపు నుంచి వస్తున్న మరోలారీని గమనించకుండా వేగంగా మలుపు తిప్పడమే ప్రమాదానికి కారణమైంది. లారీని ఓవర్ టేక్ చేయకపోయినా, మలుపులో అరనిమిషం ఆగినా ప్రమాదం తప్పేదని పోలీసులు చెప్తున్నారు. జాతీయ రహదారిపై పట్టణాలు, గ్రామాల్లోకి వెళ్లాల్సిన చోట వాహనాలు వేగం తగ్గేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయలేదు. డివైడర్లు ఏర్పాటు చేయలేదు. ఇలాంటి చోట్ల యూటర్న్ విధానం అమలు చేస్తే ప్రమాదాలకు అవకాశాలు స్వల్పం.


మరింత సమాచారం తెలుసుకోండి: