ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి లో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఇదో వస్తాం, అదిగో వస్తాం అని ఊరిస్తున్న సచివాలయ ఉద్యోగులు అమరావతికి రాకపోగా బాబుకు చుక్కలు చుపిస్తున్నారట...! వారానికి కేవలం ఐదు రోజుల సడలింపు విధానాన్ని ప్రవేశపెట్టినా ఉద్యోగులు మాత్రం ఏదో నెపంతో తప్పించుకుంటూనే ఉన్నారు. వీరి వ్యవహార శైలి బాబును ముప్పుతిప్పలు పెడుతున్నట్లు తెలుస్తోంది.


నవ్యాంధ్ర తాత్కాలిక రాజధానిగా సేవలందిస్తోన్న విజయవాడ, గుంటూరు సమీప ప్రాంతాల్లో ఇంటి అద్దెలు, మౌలిక వసతుల కొరతతో పాటు పిల్లల భవిష్యత్ సాకుగా చూపుతూ వచ్చిన ఉద్యోగులకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేసిన నేపథ్యంలో వెళ్లక తప్పని పరిస్థితుల్లో తప్పించుకునేందుకు కొత్త మార్గాలు వెతుకుతున్నారు.


జూన్ 27 లోపు అన్నీ హెచవోడీలు హైదరాబాద్‌ నుంచి కొత్త రాజధానికి తరలివెళ్లాలని ప్రభుత్వం ఆ సర్క్యులర్‌‌లో పేర్కొంది. 9, 10 షెడ్యూళ్లలో ఉన్న సంస్థలను మినహాయించి... మిగిలినప్రభుత్వ సంస్థలన్నీ కొత్త రాజధానికి వెళ్లాలని స్పష్టం చేశారు. తమ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేసుకునే అవకాశాలను పరిశీలించాలన్నారు.


విజయవాడ, గుంటూరుకు వెళ్లి ప్రభుత్వ కార్యాలయాలను స్వయంగా వెతుక్కోవాలని ప్రభుత్వం నుంచి అన్ని విభాగాలకు చెందిన హెచవోడీలు సర్క్యులర్‌ వెళ్లగా, ఉద్యోగుల్లో అనేకులు లాంగ్ లీవ్ తీసుకుని ఈ 'వెతుకులాట' సమస్య నుంచి బయటపడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొంతమంది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి హైదరాబాద్ లోనే ఉండిపోవాలని కూడా భావిస్తున్నారని ఉద్యోగ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


నవ్యాంధ్ర నూతన రాజధానికి ఉద్యోగుల తరలింపునకు సరిగ్గా నెల రోజుల గడువు మాత్రమే ఉండగా, ఇప్పటివరకూ ఒక్క కార్యాలయానికి కూడా సరైన భవంతి వసతి కుదరలేదు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందుగా అనుకున్న విధంగా ఉద్యోగుల తరలింపు సక్రమంగా పూర్తవుతుందా అన్నది వేచి చూడాలి. మరోవైపు రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని గుంటూరులోనే ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్‌ మల్లికార్జునరావు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: