ఒక వైపేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వప్నం ప్రత్యేక హోదా ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని కళ్లకు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సందర్భంలో వారి ఆశలను అడియాశలు చేశారు బీజేపీ మహిళా నేత దగ్గుబాటి  పురందేశ్వరి. ఎపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తి ఎట్టిపరిస్థితుల్లో లేదని పురందేశ్వరి ఏపీ ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చారు. అసలు 2017 నాటికి అలాంటి రాష్ట్రాలే కనబడవని ఇకపై ప్రత్యేక హోదాఅనే పదాన్ని వాడాల్సిన అవసరం లేదన్నారు.


14 వ ఆర్ధిక సంఘం సిఫార్సుల ప్రకారం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నదని. హోదా ఇవ్వనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అన్ని రకాలుగా చేయూతనందిస్తుందని స్పష్టం చేసారు. వచ్చే సంవత్సరం ఆఖరుకల్లా ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు ఆ హోదా రద్దయిపోతుందని ఆమె జోస్యంచెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పదేపదే విమర్శించడం తగదని, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి మరిన్ని నిధులు రానున్నాయని తెలిపారు. 


కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర హోదాని పెడచెవిన పెట్టి ఆంధ్రా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలో నిజం లేదని, వారు స్వార్థ పూరిత రాజకీయాలతో పబ్బం గడపాలని ప్రయత్నిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదని గగ్గోలు పెడుతున్న నేతలు... ఇప్పటివరకు ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధుల గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. బీజేపీపై రాష్ట్రంలో తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న నిధుల గురించి క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: