కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం పగ్గాలు చేపట్టి రెండేళ్లైంది. ఈ రెండేళ్లలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? కాంగ్రెస్ హఠావో నినాదంతో అధికారం చేపట్టిన మోదీ కేబినెట్ ఎంత ప్రభావవంతంగా పని చేసిందనే విషయంపై సీఎన్బీసీ, టీవీ 18, ఎంఆర్ అడ్వైజర్స్ సంస్థలు సంయుక్తంగా సర్వే చేపట్టాయి. ఈ సర్వే పోల్ లో కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, ద్వితీయ స్థానంలో విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ నిలిచారు. ఆ తరువాతి స్థానంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, తరువాత రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, ఐదవ స్థానంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిలిచారు.

 

ఇక ఎన్డీయే అధికారం చేపట్టిన తరువాత చేపట్టిన స్టార్టప్ ఇండియా, బ్లాక్ మనీ కోసం పెట్టిన సింగిల్ విండో క్లియరెన్స్, బ్యాంకు సంస్కరణలు ప్రజలను ఆకట్టుకున్నాయని సర్వే తెలిపింది. జీఎస్టీబిల్లు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లలో పెద్దగా పెట్టుబడుల ఉపసంహరణ లేకపోవడం, రైల్వే ప్రైవేటైజేషన్, కార్మికచట్టాలను మార్చకపోవడంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని సర్వే వెల్లడించింది. 2014 మే 26న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరింది. రెండేళ్లు పూర్తికావొస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ మోదీ సర్కార్‌పై దేశ వ్యాపార వర్గాల్లో విశ్వాసం, సానుకూలత వ్యక్తమవుతున్నదని తాజా సర్వేలో వెల్లడైంది.


అయితే, ప్రతిష్టాత్మక జీఎస్టీ బిల్లును ఇంకా పార్లమెంటులో ఆమోదించకపోవడం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెటుబడుల ఉపసంహరణ వేగం పుంజుకోకపోవడం, రైల్వే ప్రైవేటీకరణ, కార్మిక సంస్కరణలు నత్తనడకన సాగడంపై భారత కార్పొరేట్ వర్గాలు ఒకింత అసంతృప్తితో ఉన్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. మోదీ సర్కార్‌ దేశంలో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలపై 67శాతం మంది సీఈవోలు సంతృప్తి వ్యక్తం చేసినట్టు 'బిగ్ సీఈవో పోల్‌'లో వెల్లడైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: