చెన్నై సత్రం భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దీనిపై సాక్షి పత్రిక ప్రచురించిన కథనం రాజకీయ దుమారం సృష్టించేలా ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. సీఎం కుమారుడే ఈ మొత్తం వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిలోని అమరేశ్వరి ఆలయ భూముల విక్రయాలను రద్దు చేయాలని వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఎకరా రూ.6కోట్లుగా ప్రభుత్వమే నిర్దేశించిన ప్రాధమిక ధరను కూడా పక్కన పెట్టేశారని ఆరోపించారు. పూర్తిగా నియమ నిబంధనలను ఉల్లంఘించి మద్రాసు నగరంలో నడిబొడ్డున ఉన్న 83ఎకరాల ఆలయ భూమిని ఎకరాలను కేవలం ఎకరా రూ.27లక్షలు వంతున ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు.

కాపు కార్పోరేషన్‌ ఛైర్మన్‌ కుమారుడికి ప్రభుత్వం నిర్దేశించిన మొత్తానికంటే తక్కువకు ఏ విధంగా ఇచ్చారని నిలదీశారు. యువ నేతలందరికి సీఎం పుత్రరత్న లోకేష్‌బాబునే రింగ్‌ లీడర్‌ అని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అమరేశ్వరి ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని..టీడీపీ ఎమ్మెల్యే రాసిన లేఖను ఆసరా చేసుకుని ఈ వ్యవహారాన్ని నడిపించారని ద్వజమెత్తారు. 

ఇప్పటికైనా ఆ వ్యవహారంపై విచారణ జరిపించాలని..తాము చేసిన ఆరోపణలు నిజం కాదని తేలితే తమను శిక్షించొచ్చని బొత్స పేర్కొన్నారు. ఆ అమ్మకాలను వెంటనే రద్దు చేసి బహిరంగ వేలం నిర్వహించాలని..డిమాండ్‌ చేశారు. రెండు సంవత్సరాల్లో చంద్రబాబునాయుడు చేసిన నయవంచన పాలనపై జూన్‌ 2వ తేదీన అన్ని నియోజక వర్గాల కేంద్రాల్లో సమావేశం నిర్వహిస్తామన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: