ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష బరిలోకి దిగే టికెట్‌ను అందుకోవడమే ఆలస్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే డొనాల్డ్ ట్రంప్‌పై ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు, విమర్శలు, ఆయన విధానాలపై ప్రపంచ దేశాల నేతలను గందరగోళానికి గురి చేస్తున్నాయని ఒబామా పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడి కోసం జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తొలి నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


అమెరికా అధ్యక్షుడు కావాలన్నది తన కల అని ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఆ దిశగా ఆయన విజయవంతంగా సాగిపోతున్నారు.అమెరికా అధ్యక్ష పదవి రేసులో నిలబడటానికి రిపబ్లికన్ పార్టీ నుంచి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను ట్రంప్ సాధించారు. ఈ విషయాన్ని అసోసియేటెడ్ ప్రెస్ ప్రకటించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల నుంచి అవసరమైన మద్దతు పొంది నామినేషన్‌కు అర్హత సాధించారు.


ఈ పార్టీ టికెట్ దక్కించుకునేందుకు అవసరమైన డెలిగేట్ల మద్దతు కూడా సంపాదించారు. బరిలో నిలిచేందుకు 1237 మంది డెలిగేట్ల మద్దతు అవసరం. అయితే వీరీలో 1150 మంది ప్లెడ్జ్‌డ్ సభ్యులు , 88 మంది అన్‌బౌండెడ్ డెలిగేట్లు ఉన్నారు. వచ్చే నెలలో జరగనున్న నేషనల్ కన్వెన్షన్‌లో తాము ట్రంప్‌కే మద్దతిస్తామని 88 మంది అన్‌బౌండెడ్ సభ్యులు తెలిపారని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది.

 

ట్రంప్ ర్యాలీలో ఘర్షణ…

డోనాల్డ్ ట్రంప్ ర్యాలీలో మళ్లీ ఘర్షణ. కాలిఫోర్నియాలోని శాండియాగోలో ట్రంప్ మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు పరస్పరం కేకలు వేసుకుని, నీళ్ల సీసాలు విసురుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి సుమారు 35 మందిని అరెస్టు చేశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసినందుకు శాండియాగో పోలీసులకు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు వెంటనే స్పందించారని ట్వీట్ చేశారు.


జూన్ 7న కాలిఫోర్నియా ప్రైమరీలో ఎన్నికలు జరగనున్నాయి. మెక్సికో సరిహద్దు సమీపంలో ఆ ప్రాంతం ఉన్నందున ఆందోళనకారులు ట్రంప్ ర్యాలీని అడ్డుకున్నారు.  అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు మెక్సికో సరిహద్దులో గోడ కట్టనున్నట్లు గతంలో ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, విరాళాల సేకరణ కోసం చేసిన తొలి యత్నంలోనే ట్రంప్ రూ. 40 కోట్లు సేకరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: