కార్యకర్తలారా మీ అందరిపై ఒక బాధ్యత ఉంది వచ్చే మూడేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో అధికారం సాధించేందుకు మీరంతా కృషి చేయాలి. భాజపా తెలంగాణ శాఖ ఈ కార్యసాధనలో వెనకబడుతోందని నేను భావించడంలేదు. దేశంలో భాజపాకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. తెలంగాణలో కూడ భాజపా అధికారంలోకి వచ్చితీరుతుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా, పోరాటాల ద్వారా ఈ లక్ష్యం సాధించాలి’’ అని అమిత్‌షా పార్టీశ్రేణులకు కర్తవ్యబోధ చేశారు.

 

 స్వాతంత్రం వచ్చాక 67 సంవత్సరాల్లో చేయని ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పనులను రెండేళ్లలో నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం చేసి చూపిస్తోందన్నారు. స్వతంత్ర భారతావనిపై మోదీ ప్రభుత్వం ఎన్నో తొలిముద్రలు వేసిందన్నారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌ సమీపంలోని శంషాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ముఖ్య నాయకుల రాష్ట్రస్థాయి సదస్సులో, విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.


దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ వికాస పర్వం విజయోత్సవ సంబరాలు కావన్నారు. ‘‘మేం చేస్తున్నవి విజయోత్సవ సంబరాలు కావు. దశాబ్దాల తర్వాత దేశంలో పూర్తి మెజార్టీనిచ్చి అధికారాన్ని కట్టబెట్టిన ఈ దేశ ప్రజలకు వినమ్రంగా మేము.. మా పనితీరుపై సమర్పించుకున్న జమాపత్రం మాత్రమే. ఇప్పటివరకూ ఏం చేశామో.. ఇకముందు ఏం చేయాలనుకుంటున్నామో వివరిస్తున్నాం. ఇది మా సంప్రదాయం. 

 

రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం. ఆంధ్రలో తెదేపా మా బంధం కొనసాగుతుంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వటానికి కొన్ని పాలనాపరమైన ఇబ్బందులున్నాయి. అందుకే ‘హోదా స్ఫూర్తి’తో సాయం చేస్తున్నాం. ఏపీ భాజపా అధ్యక్షుడిని త్వరలో ప్రకటిస్తాం. తెలంగాణలో పొత్తు కోసం తెరాస నుంచి దరఖాస్తేమీ రాలేదు(వ్యంగ్యంగా) వస్తేచూస్తాం. తెలంగాణలో భాజపా బలమైనశక్తిగా ఆవిర్భవించబోతోందని జోస్యం చెప్పారు.


మోదీ టూరిస్టు ప్రధానిగా మారారని, ఈ రెండేళ్ళలో దేశం ‘వికాస్‌’ కాదు వినాశనమైందన్న కాంగ్రెస్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘‘కాంగ్రెస్‌ అంతకంటే ఏం మాట్లాడగలుగుతుంది? మన్మోహన్‌ కంటే మోదీ తక్కువే విదేశీ పర్యటనలు చేశారు. కానీ మన్మోహన్‌ వెళితే ఎవరూ గుర్తించేవారు కాదు. ఎవరో రాసిన కాగితాలు చదివి వచ్చేవారు. అదికూడా థాయిలాండ్‌లో చదవాల్సింది మలేసియాలో, మలేసియాలో చదవాల్సిన థాయిలాండ్‌లో చదివేవారు. భారత ప్రతిష్ఠను మోదీ పెంచి వస్తున్నారు’’ అని షా అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: