ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మొన్న జరిగిన మహానాడు వేదికగా వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ‘నేనేదో కాంట్రాక్టుల్లో వాటాలు తీసుకొంటున్నానని.. కమీషన్లు తీసుకొంటున్నానని ప్రతిపక్ష పార్టీల పెద్దలు నాపై రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. మహానాడు వేదికపై కార్యకర్తల సాక్షిగా సవాల్‌ చేస్తున్నా. నాపై చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటంటే ఒక్కటైనా నిరూపించండి. నా అంతట నేనే వెళ్లి జైల్లో కూర్చుంటా. చేతనైతే ముందుకు రండి’ అంటూ సవాల్‌ విసిరారు. మహానాడులో చివరి రోజైన ఆదివారం లోకేశ్‌ మాట్లాడారు.

 

దొంగ పనులు చేసి జైలుకు వెళ్లాలన్న కోరిక తనకు లేదని, అటువంటి వాటికి తాను దూరమన్నారు. అబద్ధాలు ప్రచారం చేయడానికి మనకు దొంగ పేపర్‌, దొంగ చానల్‌ లేవని, కార్యకర్తలే బాధ్యత తీసుకొని దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ‘మనం ఎన్నికల హామీలేవీ నెరవేర్చలేదని దొంగబ్బాయి రోజూ విమర్శిస్తున్నారు. రూ.25 వేల కోట్లు ఖర్చుపెట్టి రైతులకు రుణమాఫీ చేశాం. రూ.10 వేల కోట్లు ఖర్చు చేసి డ్వాక్రా సంఘాలకు సాయం చేశాం.  


‘నాపై ఆరోపణలు చేస్తున్న దొంగబ్బాయి 11 అవినీతి కేసుల్లో మొదటి నిందితుడు. 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. నేను పుట్టినప్పుడే నా తాత ముఖ్యమంత్రి. నా తండ్రి పదేళ్లు ముఖ్యమంత్రి. నా తాత, తండ్రి కలిసి 16 ఏళ్లు ముఖ్యమంత్రులుగా చేశారు. తప్పుడు పనులు చేయాల్సిన ఖర్మ నాకు పట్టలేదు. మా తాత, తండ్రి అంత మంచి పేరు నాకు వస్తుందో లేదో చెప్పలేను కానీ.. చెడ్డపేరు మాత్రం తెచ్చుకోను. జగన మాదిరిగా నేను మా నాన్నకు ఏనాటికీ చెడ్డపేరు తీసుకురాను’ అని స్పష్టం చేశారు.

 

అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో రాష్ట్రమంతా 24 గంటల కరెంటు అందుబాటులోకి తెచ్చాం. కేవలం 18 నెలల్లో గోదావరి, కృష్ణా నదులు అనుసంధానం చేసి రాయలసీమకు నీరివ్వడానికి బృహత ప్రయత్నం చేస్తున్నాం. చిత్తూరు జిల్లా శ్రీసిటీలో ఫాక్స్‌కాన కంపెనీ పెట్టిస్తే ఏడున్నర వేల మందికి ఉద్యోగాలొచ్చాయి. తిరుపతి వద్ద 4 సెల్‌ఫోన కంపెనీలు ఫ్యాక్టరీలు పెడుతున్నాయి. రాబోయే నాలుగు నెలల్లో 20వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం’ అని లోకేశ్‌ అన్నారు. ‘విభజన’ హామీలు నూటికి నూరు శాతం అమలు కావాల్సిందేనని, దాని కోసం కేంద్రంపై టీడీపీ ఒత్తిడి తెస్తూనే ఉంటుందన్నారు.

 

 మనది ఆంధ్రా పార్టీ అని తెలంగాణలో ముద్ర వేశారు. ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించిందే తెలంగాణలో.. అది ఆంధ్రా పార్టీ ఎలా అవుతుంది?’ అని లోకేశ్‌ ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్‌లోని పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్ కు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వెళ్లినవారేనన్నారు. వారంతా ఆంధ్రా పార్టీ ఏజెంట్లు అవుతారా? అని నిలదీశారు. ‘ఇప్పుడు హైదరాబాద్‌ ఇంత ఆదాయంతో వెలుగొందుతుందంటే దానికి టీడీపీ కారణం కాదా? టీడీపీ ఆంధ్రా పార్టీ అయితే తెలంగాణను, హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేస్తుంది’ అని లోకేశ్‌ ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: