చెన్నైలోని సదావర్తి సత్రం భూముల వ్యవహారం రోజుకోమలుపు తిరుగుతోంది. దాదాపు 2000 కోట్ల  విలువ చేసే భూములను తెలుగు దేశం నేతలు కారు చౌకగా కొట్టేశారన్నది సాక్షి పత్రిక అభియోగం. ఆమేరక ఇటీవల ఓ బ్రహ్మాండమైన కథనం సాక్ష్యాధారాలతో సహా ప్రచురించింది. చెన్నైలోని ఆ భూముల విలువ అధికారికంగానే ఎకరం ఆరు కోట్లు ఉంటే ఆంధ్రా సర్కారు ఎకరా ఇరవై ఏడు లక్షలకే ఎలా అమ్మేందుకు అనుమతి ఇచ్చిందని సాక్షి నిలదీసింది. 

తెలుగుదేశం ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తో ఈ భూములు అమ్మాలంటూ లేఖ రాయించి.. దాన్ని సి.ఎమ్.ఆఫీస్ తో ఓకే చేయించి.. ఇష్టారాజ్యంగా భూములు అమ్మేశారని.. దాన్ని కాపు కార్పొరేషన్ చైర్మన్ , టీడీపీ నేత చలమలశెట్టి రామనుజయ్య కుటుంబ సభ్యులు కొన్నారని సాక్షి ఆధారాలు చూపింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక సీఎం కుమారుడు లోకేశ్ ఉన్నారనే అర్థం వచ్చేలా నేరుగా పేరు పెట్టకుండా సాక్షి తన కథనంలో పేర్కొంది.

ఇచ్చేస్తా.. తీసుకుంటారా.. 



ఈ ఇష్యూపై ఆలస్యంగానైనా సంబంధీకులు స్పందించారు. ముందు ఈ విషయంపై స్పందించన వారు.. క్రమంగా మీడియా ముందుకు వస్తున్నారు. తన విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్దమని టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మీడియా ముందు ప్రకటించారు. మరోవైపు అమరావతి దేవస్థానానికి చెందిన భూములను వేలంలో కొనుగోలు చేసిన తన కుటుంబ సభ్యులపై సాక్షిమీడియా అసత్య కథనాలు రాస్తోందని కాపు కార్పోరేషన్ అధ్యక్షులు చలమశెట్టి రామానుజయ ఆరోపించారు.

 చైన్నై దగ్గరలో ఉన్న 83ఎకరాల భూములను తన కుమారుడు మరికొందరితో కలిసి కొనుగోలు చేసిన మాట వాస్తవమేనన్నారు. అయితే అదంతా చట్టబద్దంగా జరిగిన వేలంలో కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. కాపులెవరూ అభివృద్ధి చెందకూడదనే ఉద్దేశంతో జగన్ వ్యవహరిస్తున్నారని... అందుకే తన మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వెయ్యి కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెబుతున్న వారు 30కోట్లిచ్చి ఆ భూములు తీసుకోవచ్చని సవాల్ విసిరారు. మరి దీనికి సాక్షి ఏం సమాధానం చెబుతుందో..!?


మరింత సమాచారం తెలుసుకోండి: