రాజకీయాల్లోనూ అదృష్టం కలసిరావాలంటారు. కొందరు నాయకులకు అన్నీ అలా కలసివస్తాయి.. మరికొందరికి అధికారం చేతికి వచ్చినా పాలనలో అన్నీ చిక్కులే ఎదురవుతాయి. ఇందుకు చంద్రబాబునే ఉదాహరణగా తీసుకోవచ్చు. గతంలో వైఎస్ సీఎంగా ఉన్న కాలంలో ఆయనకు అన్నీ కలసి వచ్చాయి. వర్షాలు కురవడం, ఆదాయాలు పెరగడం ఇలా అన్నీ.. 

అందుకే రాజశేఖర్ రెడ్డి పాలన నల్లేరుపై నడకగా సాగింది. ఈ విషయం చంద్రబాబు మదిలోనూ ఉందేమో.. తాజాగా వైఎస్ పై ఉన్న అక్కసును చంద్రబాబు వెళ్లగక్కుకున్నారు. మరోసారి వైఎస్సార్ పై సంచనలన వ్యాఖ్యలు చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్ష విషయంపై మాట్లాడుతూ వైఎస్సార్ ప్రస్తావన తీసుకొచ్చారు. కాపులను బీసీల్లో చేరుస్తామని 2004లో రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పెట్టిన సంగతి గుర్తు చేశారు. 


మరి 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చారు. కానీ ఆయన కాపుల విషయం పట్టించుకోలేదు.. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీకు దేవుడు.. వారి కోసం కార్పొరేషన ఏర్పాటు చేసి, బీసీల జాబితాలో చేర్చేందుకు కమిషన ఏర్పాటు చేసిన నేను విరోధినా? అంటూ చంద్రబాబు ముద్రగడను ప్రశ్నించారు. తాను ముద్రగడకు ఏమైనా హామీ ఇచ్చానా అన్నారు. 

తుని విధ్వంసకాండలో రైలును కాల్చారు.. పోలీసు వ్యాన్లకు నిప్పుపెట్టారు. ఇలాంటి సంస్కృతి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎన్నడైనా ఉందా?. బయటి నుంచి వెళ్లిన వ్యక్తులే విధ్వంసానికి పాల్పడి భయభ్రాంతులకు గురిచేశారు. సమస్యలు సృష్టించడం మంచిది కాదని ముద్రగడకు కూడా చెబుతున్నాను. కమిషన వేస్తామన్నాను.. వేశాం.. అయినా కూడా ఆందోళన చేయడం వెనుక ఉద్దేశమేమిటి’ అంటూ ముద్రగడ తీరును చంద్రబాబు తప్పుబట్టారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: