తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. బ్రెగ్జిట్‌పై సందేహాలకు స్పష్టత వచ్చేసింది. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోవడమనేది ఎట్టకేలకు ఖాయమైంది. నాలుగు దశాబ్దాలుగా ఐరోపా సమాఖ్యతో కలిసి ఉన్న బ్రిటన్‌.. ఇప్పుడు వేరుకుంపటికి సిద్ధమైంది.  ఈ పరిణామం ప్రపంచ దేశాలతో పాటు బ్రిటన్‌ మీద ప్రభావాన్ని చూపిస్తుందన్న నేపథ్యాన్ని బ్రిటీషర్లు పట్టించుకోకపోవటం గమనార్హం. శుక్రవారం వెలువడిన ఫలితాల్ని చూస్తే యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బయటకు వచ్చే విషయంలో స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.



నిన్న రెఫరెండంపై ఓటింగ్ జరుగగా, అన్ని పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు పూర్తయింది. 382 లోకల్ అథారిటీస్ తమ ప్రాంత ఫలితాలను వెల్లడించాయి. బ్రెగ్జిట్ కు అనుకూలంగా 51.9 శాతం మంది, వ్యతిరేకంగా 48.1 శాతం మంది ఓట్లు వేశారు. యూనియన్ లోనే బ్రిటన్ ఉండాలని 1,61,41,241 మంది, వీడి పోవాలని 1,74,10,742 మంది కోరుకున్నారు. దీంతో 12,69,501 ఓట్ల తేడాతో బ్రెగ్జిట్ విజయం సాధించింది. 



బ్రిటన్‌లో విద్యతోపాటు, నేషనల్ హెల్త్ స్కీమ్ కింద వైద్య సేవలు ఉచితం అవడం వల్ల యూరప్‌కు చెందిన పేద దేశాల నుంచి గత రెండు,మూడు ఏళ్లుగా భారీగా పెరిగాయి. దీనికి తోడి ఆర్థిక సంస్కరణల పేరిట ప్రధాన మంత్రి కేమరాన్ నిరుద్యోగ భృతిని, పిల్లల పెంపక భృతిని బాగా తగ్గించడంతో స్థానికుల్లో ఆగ్రహం పెరిగింది. దానికి తోడు సిరియా నుంచి వలసలు భారీగా పెరగడం కూడా వారి ఆగ్రహాన్ని రెట్టింపు చేసింది


మరింత సమాచారం తెలుసుకోండి: