భారత్ సభ్యత్వంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండానే ఎన్‌ఎస్జీ(అణు సరఫరాదారుల కూటమి) సభ్య దేశాల రెండ్రోజుల ప్లీనరీ శుక్రవారం ముగిసింది. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్‌ఎస్జీ)లో సభ్యత్వానికి మద్దతు ఇవ్వాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను ప్రధాని నరేంద్రమోదీ కోరిన విషయం విదితమే. ఉబ్జెకిస్థాన్‌లో గురువారం ప్రారంభమైన రెండు రోజుల షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు తాష్కెంట్ చేరుకొన్న ప్రధా ని.. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ఎన్‌ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. చైనా అడ్డుపుల్లలు వేస్తున్న సంగతి విదితమే. కాగా, చైనా అధ్యక్షుడితో భేటీ అయిన ప్రధాని నరేంద్రమోదీ.. అన్ని అంశాలను మదింపు చేసుకొని నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్‌ఎస్జీలో భారత్‌కు మద్దతు ఇవ్వాలని కోరగా అందుకు చైనా అడ్డుపుల్ల వేసింది. 



ఎన్పీటీపై(అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం) భారత్ సంతకం చేయనందున... ఆ దేశానికి సభ్యత్వం అంశం పరిగణనలోకి తీసుకోవద్దని సదస్సులో చైనా వాదించింది. బ్రెజిల్, స్విట్జర్లాండ్, టర్కీ, ఆస్ట్రియా, ఐర్లాండ్, న్యూజిలాండ్‌లు చైనాకు మద్దతు తెలపడంతో భారత్‌కు దారులన్నీ మూసుకుపోయాయి. ఎన్పీటీపై సంతకం చేయని దేశాలకు ఎన్‌ఎస్‌జీలో  సభ్యత్వం కోసం ముందుగా విధివిధానాలు రూపొందించాలని చైనా కోరింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో పాటు గ్రూపులోని చాలా దేశాలు మదతిచ్చినా చైనా అడ్డుపుల్ల వేయడంతో ఆశలు ఆవిరయ్యాయి.



చైనా నిరాయుధీకరణ విభాగం డైరక్టర్ జనరల్ వాంగ్ క్యున్ మాట్లాడుతూ.. భారత్ వంటి నాన్-ఎన్పీటీ దేశాలకు సభ్యత్వంపై కూటమిలో ఏకాభిప్రాయం లేదని, ఎన్‌ఎస్జీలో సభ్యత్వం కావాలంటే ఎన్పీటీపై సంతకం చేయడం తప్పనిసరని అన్నారు. ఈ నియమం చైనా పెట్టింది కాదని, అంతర్జాతీయ సమాజమే పెట్టిందన్నారు.నాన్-ఎన్పీటీ దేశాలకు సభ్యత్వం అంశాన్ని అజెండాలో పెట్టేందుకు ఎన్‌ఎస్జీ అంగీకరించలేదని, అందువల్ల చైనా వ్యతిరేకించడం అన్న ప్రశ్నే లేదని సమర్థించుకున్నారు. 



గురువారంజరిగిన ప్రత్యేక భేటీలో భారత్ వినతిపై చర్చించినా... చైనాతో పాటు పలు దేశాలు వ్యతిరేకించడంతో భేటీ అసంపూర్తిగా ముగిసింది. భారత్‌కు సహకరించాలంటూ గురువారం ఉదయం తాష్కెంట్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసినా ఫలితం దక్కలేదు.  భారత్‌తో పౌర అణు సహకారం -2008 ప్రకటనపై అన్ని కోణాల్లో చర్చించామని, ఎన్‌ఎస్జీలో నాన్-ఎన్పీటీ దేశాలకు సభ్యత్వంపై సాంకేతిక, న్యాయ, రాజకీయ కోణాల్లో కూడా పరిశీలించామని సభ్య దేశాలు పేర్కొన్నాయి. ఎన్‌ఎస్జీలో సభ్యత్వానికి చైనా అడ్డుపడడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: