సాధారణంగా ఏ ప్రాజెక్టులోనైనా నీటిని నిల్వ చేయాలంటే ముంపు సమస్యను పరిష్కరించాల్సిందే. పులిచింతల ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలంటే ఆర్‌అండ్‌ఆర్ (పునరావాసం, పునర్నిర్మాణం) అంశాల్ని కొలిక్కి తీసుకురావాలి. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాధ్యత. కానీ ఆ ప్రభుత్వ పెద్దలు మాత్రం వాటిని పట్టించుకోలేదు. అంతేకాదు,  గత నెలలో మంత్రి హరీశ్‌రావు స్వయంగా ఏపీ మంత్రి దేవినేని ఉమకు ఫోన్ చేసి ఈ విషయంపై మాట్లాడారు. ఆర్డీఎస్‌పై మాట్లాడిన సందర్భంలో ప్రత్యేకంగా ఫోన్ చేసి.. పులిచింతలపై కూడా మాట్లాడుకుందామని ఆహ్వానించారు. ముఖ్యంగా పులిచింతల అంశమనేది ముంపుపరంగా తెలంగాణకు సంబంధించినది అయినప్పటికీ సమస్య పరిష్కారమైతే పూర్తిస్థాయిలో నీటి నిల్వ చేసుకోవడమనేది ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం కలిగేదని కూడా చెప్పారు. అయినా దేవినేని ఉమ మాత్రం తేదీ ఖరారు చేస్తానంటూ జారుకోవడం తెలిసిందే. దీంతో పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది.



దాంతో తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడటంలో భాగంగా సమస్యలన్నీ పరిష్కరించేవరకు పులిచింతల నింపొద్దని తెలంగాణ ప్రభుత్వం ఏపీ సర్కారుకు తేల్చి చెప్పింది. ఈ మేరకు శుక్రవారం లేఖ రాసినట్లుగా నీటిపారుదలశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఏండ్లు గడుస్తున్నా ముంపు గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదు. ఆర్‌అండ్‌ఆర్ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వమే చేపడుతుంది. ఇందుకు కావాల్సిన నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం చాలాకాలం కిందటే రూ.115 కోట్ల మేర సవరణ ప్రతిపాదనల్ని ఏపీ సర్కారుకు పంపింది. అంతేకాదు.. ఆర్‌అండ్‌ఆర్ పూర్తి చేయడానికి ఈ మేరకు నిధులు వెంటనే విడుదల చేయాల్సిందిగా 2015 ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వం ఏపీకి లేఖ కూడా రాసింది. అయినా అక్కడినుంచి మాత్రం స్పందన రాలేదు.



ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన పులిచింతల ప్రాజెక్టు కారణంగా నల్లగొండ జిల్లాలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యా యి. 45 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నందున 13 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. అడ్లూరు, వెల్లటూరు, కిష్టాపురం, చింత రియాల, నెమలిపురి, రెబల్లె, శోభనాద్రపురం, సుల్తాన్పూ ర్, మట్టపల్లి, గుండ్లపల్లి, గుండెబోయినగూడెం, తమ్మవరం, పీక్లానాయక్ తండా తదితర గ్రామాలు ఈ జాబితాలో ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: