నెల్లూరు జిల్లా వెంకటాచలంలో శుక్రవారం స్వర్ణభారత్‌ ట్రస్టు ఆధ్వర్యంలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మోదీని దేవుడు అంటే కొందరు తప్పుపడుతున్నారు. దేశ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆయనను దేవుడు అంటే సందేహాలెందుకు?’ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. 



రాజ్యసభకు నాల్గవసారి ఎన్నికైన తర్వాత.. శుక్రవారం నెల్లూరు వచ్చిన వెంకయ్యకు బీజేపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. ‘పేదరిక వ్యవస్థ నిర్మూలనకు మోదీ ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకువచ్చింది. కేంద్రం తీసుకువస్తున్న టెక్స్‌టైల్‌ పాలసీ వల్ల కోటిమందికి ఉద్యోగాలు రానున్నాయి. దేశంలో రానున్న మూడేళ్లలో అభివృద్ధిపరంగా నిశ్శబ్ద విప్లవం రానుంది.’ అని వెంకయ్యనాయుడు తెలిపారు.



ఈ సమావేశానికి ముఖ్య అతిథి గా హాజరైన కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌  మాట్లాడుతూ, మూడేళ్లలో దేశమంతటా విద్యుత్‌ వెలుగులు ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత రెండేళ్లలో 8 వేల గ్రామాలకు విద్యుత్‌ సరఫరా అందించినట్టు చెప్పారు. వచ్చే మూడేళ్లలో 10 వేల గ్రామాలకు విద్యుత్‌ సరఫరా అందించి.. దేశమంతటా విద్యుత్‌ వెలుగులు నింపుతామని తెలిపారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సూచనల మేరకు ఏపీకి 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని చెప్పారు. కఠోర శ్రమ లేకుండా ఎవరూ అభివృద్ధి చెందలేరని, విద్యార్థి దశ నుంచే అందరూ అందుకు అలవాటు పడాలని సూచించారు


మరింత సమాచారం తెలుసుకోండి: