ఏపీలో అపారమైన ఖనిజ సంపద, విస్తృత అవకాశాలు ఉన్నాయని, అందుకే అక్కడ పెట్టుబడులు పెట్టాలని చైనా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కోరారు. భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం నాలుగు గంటల పది నిమిషాలకు చంద్రబాబు హాంగ్ కాంగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి టియాంజిన్ చేరుకున్న సీఎం బృందానికి ఘనస్వాగతం లభించింది. ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకానమిక్ ఫోరం) వేదికగా ఆయన దేశాధినేతలతో, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ముందుగా హంగ్జు డింగ్షెన్ ఇండస్ట్రీ గ్రూపు చైర్మన్ జోగ్జిన్హాయ్ తో సమావేశమయ్యారు. గనులు, ఖనిజ ఉత్పత్తి రంగంపై చర్చించారు. ఏపీలో ఖనిజసంపద, అవకాశాలపై ఆయనకు చంద్రబాబు వివరించారు. వ్యాపార సరళీకరణ అంశంలో భారత్ లో ఏపీ రెండో స్థానంలో, ఎఫ్ఢీఐల ఆకర్షణలో మూడోస్థానంలో ఉన్నట్లు వివరించారు.



నవ్యాంధ్రలో భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు చైనాకు చెందిన యాన్‌స్టీల్‌ గ్రూప్‌ ముందుకొచ్చింది. సుమారు రూ.3 వేల కోట్ల పెట్టుబడితో ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. నవ్యాంధ్రలో రాజధాని నిర్మాణం జరుగుతోందని, ఉక్కుకు ఎంతో డిమాండ్‌ ఉందని సీఎం వారికి వివరించారు. ఉక్కు కర్మాగారం స్థాపనకు ఇది సరైన సమయం అన్నారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అవసరమైన భూమిని సమకూరుస్తామని, అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో పర్యటించి, తమకు అనుకూలమైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవచ్చని సూచించారు. కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్స్‌కు గతంలో కేటాయించిన స్థలాన్ని పరిశీలించాలని, అది కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో ఉందని.. ఇనుప ఖనిజం పుష్కలంగా లభ్యమయ్యే ప్రాంతమని వివరించారు. చంద్రబాబు చొరవతో యాన్‌స్టీల్‌ కంపెనీ ఏపీలో రూ.3 వేల కోట్లతో ఉక్కు కర్మాగారం స్థాపించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్‌ ఇంజనీర్‌ జువెన గేంగ్‌ మాట్లాడుతూ.. ఏపీలో ఉక్కు కర్మాగారం స్థాపించేందుకు ఆసక్తితో ఉన్నామని వెల్లడించారు.



నౌకాయాన, ఆతిథ్య రంగాల్లో 9 బిలియన డాలర్ల టర్నోవర్‌ కలిగిన లిబ్రా గ్రూప్‌ ప్రతినిధి మారిస్‌ వోవెన్సతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. లిబ్రా గ్రూపు ఆసియా కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. నౌకాయాన, ఆతిథ్య రంగాల్లో ప్రపంచస్థాయి కంపెనీ అయిన లిబ్రా సంస్థకు 85 నౌకలు, 45 హోటళ్లున్నాయి. ఏపీలో విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టాలని మిత్సుబిషి కంపెనీని చంద్రబాబు ఆహ్వానించారు.



అనంతరం, శ్రీలంక మంత్రి సమర విక్రమతో బాబు సమావేశమయ్యారు. శ్రీలంక ప్రధాని పంపిన శుభాకాంక్షల సందేశాన్ని ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆయన అందజేశారు. పర్యాటక రంగంలో ఏపీతో కలిసి పనిచేయాలన్న శ్రీలంక ప్రధాని ఆకాంక్షను ఆయన చంద్రబాబుకు తెలిపారు. శ్రీలంకలో పర్యటించాలని చంద్రబాబును సమర విక్రమ ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమర విక్రమతో చంద్రబాబు మాట్లాడుతూ, పోర్టు ఆధారిత అభివృద్ధిపై తాము దృష్టి పెట్టామని అన్నారు. ఆ తర్వాత కువైట్ డానిష్ డెయిరీ కంపెనీ చైర్మన్ మహ్మద్ జాఫర్, లిబ్రా గ్రూప్, మిత్సు బుషి, హ్యులెట్ ప్యాకర్డ్, ఓజిన్ తదితర సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. కాగా, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కువైట్ డానిష్ సంస్థ ఆసక్తి కనపరిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: