తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ ను గట్టిగా విమర్శించగల నేతల్లో రేవంత్ రెడ్డి పేరు మొదటి వరుసలో ఉంటుంది. నోటుకు ఓటు వంటి కేసులో ఇరుక్కుని కూడా.. ఆ కేసు విచారణ సాగుతూనే ఉన్నా.. రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ పై విమర్శల దూకుడు ఏమాత్రం తగ్గించలేదు. అంతే కాదు.. ఇక ఇంతకు మించి ఏమవుతుందన్న కోణంలో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. 

అందుకే కేసీఆర్ సర్కారును విమర్శించే ఏ అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు. ఈ సమయంలోనే మల్లన్న సాగర్ నిర్వాసితుల అంశం రేవంత్ కు బాగా కలసివచ్చింది. వారికి న్యాయం చేయాలంటూ దీక్షకు కూర్చున్నారు. ఈ సమయంలోనే రేవంత్ మొండిపట్టుదలకు సంబంధించిన వార్త ఒకటి టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. 


మల్లన్నసాగర్ వద్ద దీక్షకు కూర్చున్న సమయంలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచుతూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. మల్లన్నసాగర్ దీక్ష ను పక్కకు పెట్టిన ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుపై ఆందోళనలు చేయాలని లోకేశ్ రేవంత్ ను ఆదేశించారట. కానీ ఆ ఆదేశాలను రేవంత్ ఏమాత్రం పట్టించుకోలేదని టాక్ వినిపిస్తోంది. 

మల్లన్నసాగర్ దీక్ష విషయంలో తనకు మంచి మైలేజ్ వస్తుందన్న కోణంలోనే లోకేశ్ ఆదేశాలను రేవంత్ పాటించలేదని తెలుస్తోంది. పార్టీ అధినేత ఆదేశాల కన్నా రేవంత్ కు సొంత ఇమేజ్ పైనే మక్కువ ఎక్కువగా ఉందని పార్టీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. అందుకే లోకేశ్ చెప్పినా వినకుండా రేవంత్ సొంత ఎజెండా అమలు చేస్తున్నారని టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: