డ్రగ్స్ మాఫియా, సెక్స్ టూరిజంకు గోవా అడ్డాగా మారిందని, దీనికి ఇక్కడున్న రాజకీయ పార్టీల నేతలూ కారణమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. గోవా పర్యాటకంగా తెచ్చుకున్న పేరును ఈ పరిస్థితులు మసకబారుస్తున్నాయని, అయినా, నేతలకు చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. ప్రస్తుతం గోవా పర్యటనలో ఉన్న ఆయన, హోటళ్లు, టూరిజం వ్యాపారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు.



గోవా పర్యటనలో ఉన్న కేజ్రీవాల్ బుధవారం పనాజీలో చిన్నస్థాయి హోటళ్లు, పర్యాటక పరిశ్రమ వాటాదారులతో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ‘సెక్స్, డ్రగ్స్‌, వ్యభిచారం వల్ల గోవాలో పర్యాటకానికి చాలా చెడ్డపేరు వస్తున్నది. ఈ అక్రమాలకు రాజకీయ పార్టీల అండ ఉండటం వల్లే దీనికి అడ్డుకట్ట పడటం లేదు’ అని కేజ్రీవాల్ అన్నారు.



గోవాలో బీజేపీ పాలన వల్లే అవినీతి పెరిగిపోయింది. ఆ కుళ్లును చీపుర్లతో కడిగేయడానికే సిద్ధంగా ఉన్నాం. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా 35 స్థానాలను గెలుచుకుంటాం'అని అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి 2017 మార్చితో గడువుతీరనుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ ల అసెంబ్లీ ఎన్నికలతోపాటే గోవా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేయడం ఇదే మొదటిసారి. గత లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఆప్ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు.



మరింత సమాచారం తెలుసుకోండి: