ట్రెగ్జిట్.. అదేంటి బ్రెగ్జిట్ అనాలిగా అనుకుంటున్నారా.. ఈయూ నుంచి బ్రిటన్ వెళ్లిపోవడాన్ని బ్రెగ్జిట్ అనగా ఇప్పుడు బ్రిటన్ ఎంపీలంతా ట్రెగ్జిట్ అంటున్నారట. ట్రెగ్జిట్ అంటే వెంటనే ట్రంప్ను పంపించేయండి అని. అదేదో తమ దేశం నుంచి కాదండోయ్.. తమను వేధించే పనిలో నుంచి. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం బ్రిటన్ ఎంపీలందరికీ వరుస మెయిల్స్ పంపిస్తున్నారంట.  ట్రంప్ ఈ-మెయిల్స్ కేవలం ప్రజా ప్రతినిధులకు మాత్రమే పరిమితం కాలేదు. లక్షలాది మంది అమెరికన్లకు సైతం, తన ప్రచారానికి అవసరమైన డబ్బులను సాయం చేయాలని కోరుతూ మెయిల్స్ వస్తున్నాయి. గత వారంలో ఆయనకు 3 మిలియన్ డాలర్ల నిధులు కూడా వచ్చాయి. ఎవరికి తోచినంత వారు ఇవ్వండి అని కోరకుండా, కనీసం 10 డాలర్లయినా ఇవ్వాలని ఆయన అభ్యర్థిస్తుండటాన్ని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.



తన ప్రచారానికి నిధులు ఇవ్వాలని కోరుతూ, వివిధ దేశాల ప్రజా ప్రతినిధులకు అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడనున్న డొనాల్డ్ ట్రంప్ ఈ-మెయిల్ లేఖలను పంపడం పలువురికి ఆగ్రహాన్ని కలిగిస్తోంది. బ్రిటన్ సహా పలు దేశాల్లోని ధనికులైన పార్లమెంట్ సభ్యులు, ఇతర నేతలకు ట్రంప్ ఈ లేఖలను పంపారు. ట్రంప్ వైఖరిని హేళన చేసిన పలువురు తమ వ్యతిరేకతను సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 



"దయచేసి ఈ అడుక్కోవడాన్ని ఆపు. ఎంపీలకు లేఖలు రాయవద్దు. ఇదో పెద్ద విషాదం" అని బ్రిటన్ ఎంపీ స్టువర్ట్ మెక్ డొనాల్డ్ ట్వీట్ చేశారు. ట్రంప్ ఇలా నిధులను కోరడం చట్ట వ్యతిరేకమన్న వాదన కూడా వినిపిస్తోంది. ఆయన హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలని హిల్లరీ క్లింటన్ లీగల్ సెల్ ప్రతినిధి పాల్ ఎస్ ర్యాన్ వ్యాఖ్యానించారు. ఈ నిధుల సేకరణ మెయిల్స్ పై ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: