గత నెల 24న చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషనులో ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని హత్య చేసిన రామ్ కుమార్, ఆపై వారం రోజుల తరువాత స్వగ్రామంలో పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. అప్పటినుండి స్వాతి హత్య కేసు పలు మలుపులు తిరుగుతూ ఎన్నో అనుమాలకు దారి తీస్తుంది. అసలు స్వాతిని హత్య చేసింది రాం కుమారేనా...? లేదా మరెవరైనానా...? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. 



స్వాతి, హంతకుడు రామ్‌కుమార్‌ జోడీగా ఉన్న ఫోటోలు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో హలచల్‌ చేస్తున్నాయి. ఈ ఫోటోలు వారు తీసుకున్నవి కాదని ఎవరో వీటిని మార్ఫింగ్‌ చేసి పోస్ట్‌ చేశారని పరుశురామ్‌ అనే వ్యక్తి గురువారం మీడియాకు వివరించారు. సోషల్‌ మీడియాలో కనిపించిన ఫోటోలో ఉన్నది స్వాతి - రామ్‌కుమార్‌ కాదని, తన కుమారుడు ప్రదీప్‌, అతని స్నేహితురాలితో కలసి పుదుచ్చేరీలో తీయించుకున్న ఫోటోను సంఘ విద్రోహులు మార్ఫింగ్‌ చేసి ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటికే కుమార్తెను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు ఇలాంటి చర్యలు మరింత బాధిస్తాయని, ఇటువంటి చర్యలు విడనాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



కాగా, తొలుత తానే హత్య చేశానని స్టేట్ మెంట్ ఇచ్చిన రామ్, ఆపై కోర్టులో పోలీసుల బలవంతం వల్ల తాను అలా ఒప్పుకున్నానని వెల్లడించి ఝలక్ ఇవ్వగా, ఇప్పుడు అతని తరఫున వాదనలకు దిగిన కృష్ణమూర్తి అతనికే ఝలక్ ఇవ్వడం గమనార్హం. తాను బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం దక్కాలని పోరాడుతున్న వ్యక్తినని, రామ్ కుమార్ సైతం దళితుడు కావడంతో సహకరించాలని భావించానని, అయితే, రామ్ కుమార్ కోర్టులో మాట మార్చడంతో తాను ఈ కేసు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని న్యాయవాది కృష్ణమూర్తి వెల్లడించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: