ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ జేవీ రాముడు పదవీ కాలం ఎల్లుండితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో, ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నండూరి సాంబశివరావు ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్సార్టీసీ) వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.



 కాగా ప్రస్తుత డీజీపీ జేవీ రాముడు ఈనెల 23న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో సాంబశివరావును ఇంఛార్జ్ డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సాంబశివరావు 1984 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఒంగోలు పట్టణంలోని మిరియాలపాలెం ఆయన స్వస్థలం. ఐఐటీ కాన్పూర్‌ నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ పట్టా పొందారు. 1987లో ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలో ఏఎస్పీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన సాంబశివరావు అంచెలంచెలుగా ఎదిగారు. 



నిజామాబాద్‌లో అదనపు ఎస్పీగా, మెదక్‌, రంగారెడ్డి, గుంటూరు, మహబూబ్‌నగర్‌ జిల్లాలతో పాటు నిఘా విభాగంలో ఎస్పీగా పనిచేశారు. నిఘావిభాగం, హైదరాబాద్‌ రేంజ్‌, సీఐడీల్లో డీఐజీగా, రాయలసీమ రీజియన్‌ ఐజీగా, విశాఖపట్నం నగర పోలీస్‌ కమిషనర్‌గా పనిచేశారు. అదనపు డీజీపీ స్థాయిలో ఏపీ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా, అగ్నిమాపక సేవల విభాగాధిపతిగా సేవలు అందించారు. శనివారం మధ్యాహ్నం ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. నియామక ఉత్తర్వులు వెలువడిన వెంటనే సాంబశివరావు ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: