ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తున్న నూతన రాజధాని అమరావతి ప్రాంతంలోని భూములను బినామీ పేర్లతో కొని మళ్లీ ప్రభుత్వ రూపేణా వేల కోట్ల రూపాయలను అధికార పార్టీ నేతలు కొల్లగొట్టారనే వార్తలు రాజధాని భు సేకరణ సమయంలో మీడియా లో హోరెత్తిన విషయం అందరికీ విదితమే. అయితే అప్పుడు పక్కా పకడ్బందీ ఏర్పాట్లు చేసి మరీ కొందరు బడా నాయకులు ప్రభుత్వాన్ని గోల్ మాల్ చేశారనే ఆరోపణలు కూడా బాగానే వచ్చాయి. తాజాగా ఇలాంటి తంతే ఒకటి బయటపడింది. టీడీపీ కార్యాలయం ముసుగులో శ్రీకాకుళంలో రూ.30 కోట్ల విలువైన రెండెకరాలు, కాకినాడలో రూ.25 కోట్ల విలువైన రెండువేల చదరపు గజాల భూమిని ఇప్పటికే కాజేశారు.
ఇదో అధికార కబ్జా!


రాజకీయ పార్టీలకు రాజధాని, జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఎకరం లోపు భూమిని 30 ఏళ్లకు లీజు పద్ధతిలో కేటాయించేలా ఆగస్టు 31, 1987లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిలో నాలుగు, జిల్లా కేంద్రాల్లో రెండెకరాలకు పైగా ఉన్న అత్యంత ఖరీదైన భూములను పార్టీ కార్యాలయాల ముసుగులో కాజేయడానికి ప్రతిపాదనలు తెప్పించుకున్న సీఎం చంద్రబాబు.. ఆ మేరకు ఉత్తర్వుల్లో సవరణ చేయాలని నిర్ణయించారు. టీడీపీ మినహా మరే ఇతర పార్టీకి భారీ ఎత్తున భూములు దక్కకుండా నిబంధనలు పెట్టాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేసీ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.



తాజాగా రాజధానితో పాటూ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ రెండు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల దాకా అత్యంత ఖరీదైన భూములను కొట్టేయడానికి ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగానే జాతీయ, ప్రాంతీయ పార్టీలకు రాజధానిలోనూ, జిల్లా కేంద్రాల్లోనూ కార్యాలయాల నిర్మాణానికి భూములను నామమాత్రపు ధరకు 99 ఏళ్లకు లీజులకు కేటాయించేందుకు వీలుగా గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీలకు కార్యాలయాల నిర్మాణానికి భూములు కేటాయిస్తారు. కానీ అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగానే భూములు కేటాయించాలనే మెలిక పెట్టడం వెనుక టీడీపీకి భారీ ఎత్తున భూములు దోచిపెట్టడానికే అన్నది స్పష్టమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: