మరో ఆప్ ఎంపీ వివాదంలో చిక్కుకున్నారు. పార్లమెంట్ కు సంబంధించిన సున్నితమైన అంశాలను సోషల్ మీడియాలో వీడియో తో షేర్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్.. తనపై వచ్చిన విమర్శలకు స్పందించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ పార్లమెంట్ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని మాత్రమే తాను ప్రస్తావించినట్లు చెప్పుకొచ్చారు. 2 నిమిషాల నిడివి గల ఈ వీడియోపై వివరణ కోసం మాన్‌కి నోటీసులివ్వడానికి స్పీకర్ కార్యాలయం దాదాపు 12 గంటలపాటు ప్రయత్నించింది. 



చివరికి శుక్రవారం ఉదయం మాత్రమే భగవంత్ అందుబాటులోకి వచ్చారు. మొదటి వీడియోపై అందరి నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంటే, మరో వీడియో కూడా పోస్ట్ చేస్తానని, గతంలో ఎవరూ చూడనివాటిని అందులో చూపిస్తానని ప్రకటించారు. ఆప్ ఎంపీ భగవంత్ మాన్‌సింగ్ వ్యవహారం పార్లమెంటులో దుమారం రేపింది. ఎంపీపై చర్యలు తీసుకోవాలంటూ సభ్యులు లోక్‌సభలో పట్టుబట్టారు. 



దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. పార్లమెంట్‌ ఆవరణలో ఆప్‌ ఎంపీ వీడియో చిత్రీకరణపై లోక్‌‌సభలో సభ్యులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భగవంత్‌పై చర్య తీసుకోవాలని ముక్తకంఠంతో సభ్యుల డిమాండ్ చేశారు. మరోవైపు పార్లమెంట్‌ ఆవరణలో వీడియో చిత్రీకరణపై ఎంపీ భగవంత్‌కు లోక్‌సభ స్పీకర్‌ సమన్లు జారీ చేశారు. దీంతో స్పీకర్ ఎదుట హాజరైన ఎంపీ వీడియో చిత్రీకరణపై స్పీకర్‌కు వివరణ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: