ఈ మధ్య కాలంలో జగన్ కు కాస్త రిలీఫ్ దొరికింది. ఎందుకంటే పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు కాస్త తగ్గాయి. అంతకుముందు వారంరోజు కనీసం 2 రోజుల ఎవరో ఒకరు టీడీపీలోకి వలస వెళ్లారనే వార్తలు వచ్చేవి.. కానీ ఇటీవల అలాంటి వార్తల తాకిడి కాస్త తగ్గింది. 

కానీ ఇంతలో ఇప్పుడు జగన్ కు మరో షాక్ ఎదురైంది. మళ్లీ అది కూడా గతంలో షాకులిచ్చిన తూర్పుగోదావరి జిల్లా నుంచే కావడం మరో విశేషం. ఈ జిల్లా నుంచి ఇప్పటికే జ్యోతులనెహ్రూ, వరుపుల సుబ్బారావు వంటి వారు వైసీపీకి టాటా చెప్పేసి సైకిల్ ఎక్కేసి జోరుగా తొక్కేస్తున్నారు కూడా. 


తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు..విజయవాడలో సిఎం చంద్రబాబునాయుడు సమక్షంలో రాజమండ్రికి చెందిన ఈ నాయకుడు పచ్చ కండువా కప్పేసుకున్నారు. ఆ తర్వాత రొటీన్ డైలాగ్ ఉందిగా.. అదేనండీ.. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం అంటూ జై కొట్టారు. 

ఇక్కడ ఆదిరెడ్డి అప్పారావు ఫ్లాష్ బ్యాక్ కాస్త చెప్పుకోవాలి.. ఈయన ఎన్నికలకు ముందే వైసీపీలోకి వచ్చారు. ఎన్నికలకు ముందు చాలామంది ఎమ్మెల్సీ టికెట్ కోరినా... జగన్ వారిని కాదని మరీ ఆదిరెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. ఆదిరెడ్డి అప్పారావు దివంగత నేత ఎర్రన్నాయుడుకు స్వయానా వియ్యంకుడు. అయినా అప్పారావుపై జగన్ నమ్మకం ఉంచారు. ఇప్పుడు అది కాస్తా వమ్మయింది. రాజకీయాల్లో ఇవన్నీ మామాలే కదా..!?



మరింత సమాచారం తెలుసుకోండి: