రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సహకారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇక నుంచి మూడు నెలలకోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ తెలిపారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో శనివారం పదాధికారుల సమావేశం జరిగింది.



ఈ సందర్భంగా పూర్తిస్థాయి కార్యకర్తల మహా సమ్మేళనం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతీ పోలింగ్‌బూత్ నుంచి కనీసం ఐదుగురు కార్యకర్తలు, ఒక మహిళా కార్యకర్త ఉండేలా చూస్తున్నామన్నారు. ప్రధానితో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రతీ మూడు నెలలకొకసారి రాష్ట్రంలో పర్యటిస్తారని ప్రభాకర్ వెల్లడించారు. అలాగే ఇక నుంచి రాష్ట్రంలో తరచుగా కేంద్రమంత్రుల పర్యట నలు కూడా ఉంటాయని చెప్పారు. 



అయితే ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా సీఎం కేసీఆర్ మరోసారి ప్రధానిని రాష్ట్రానికి ఆహ్వానించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టును తన నియోజకవర్గం గజ్వేల్‌లో ప్రారంభిస్తున్న నేపథ్యంలో.. ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా మోదీని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కోరారు. ఆయా పథకాల గురించి ఆసక్తిగా విన్న ప్రధాని.. మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. 



ఈ హామీ నిమిత్తం వచ్చే నెల 7న ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారు. వాస్తవానికి మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు రాలేదు. దీనిపై గతంలో పలుమార్లు అధికార టీఆర్‌ఎస్ కూడా విమర్శలు గుప్పించింది. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రావాలని ఆహ్వానించినా రాకపోవడంతో.. తెలంగాణపై చిన్నచూపు చూస్తున్నారన్న భావన వ్యక్తమైంది. వరంగల్‌లో కాళోజీ విశ్వవిద్యాలయ భవనం, అక్కడే కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, రామగుండంలో ఎన్టీపీసీ కొత్త ప్లాంటుకు శంకుస్థాపనలు, రామగుండంలో పునరుద్ధరించిన ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవం, హన్మకొండలో మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరణ, ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో కొత్తగా నిర్మించిన రెండు విద్యుత్ ప్లాంట్లను జాతికి అంకితం చేయడం తదితర కార్యక్రమాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రధానికి అందించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: