గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీలో ఆంధ్రా దూకుడు మీద ఉంటే తెలంగాణ మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కబెడుతోంది. 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్ పరీక్షలను సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేస్తూ తీర్పుఇచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ గతంలో పరీక్ష రాసిన అందరికీ మూడు నెలల్లో పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. 

సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీ త్వరగానే స్పందించింది. 2011  గ్రూప్-1  మెయిన్స్ పరీక్షను తిరిగి నిర్వహించేందుకు సిద్ధమైంది. ఏపీపీఎస్సీ పరీక్ష తేదీలను కూడా  ప్రకటించేసింది. సెప్టెంబరు 5 నుంచి 11 వరకూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు పరీక్ష నిర్వహణ ఏర్పాట్లును ఏపీపీఎస్సీ ప్రారంభించింది. 


2012 మే 27న ఏపీపీఎస్సీ నిర్వహించిన ఈ పరీక్షకు లక్షన్నర మంది హాజరయ్యారు. వారి నుంచి 15 వేల మందిని ఎంపికి చేసి వారికి సెప్టెంబరు 18 నుంచి 30 వరకూ మెయిన్స్ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష నిర్వహణ, ప్రశ్నాపత్రం తీరుపై అనేక విమర్శలు తలెత్తడం దాంతో కొందరు అభ్యర్థులు సుప్రీం ను ఆశ్రయించడంతో మూడున్నరేళ్ల సుదీర్ఘ తర్వాత మెయిన్స్ తిరిగి నిర్వహించాలన్న కీలక తీర్పు వెలువడింది. 

ఏపీ పరీక్ష తేదీలను కూడా ప్రకటించగా.. తెలంగాణ మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. కనీసం ఇంతవరకూ సుప్రీంతీర్పు తర్వాత ఎలాంటి స్పందనాలేదు. సుప్రీంకోర్టు 3 నెలల్లో పరీక్ష నిర్వహించాలని ఖరాఖండీగా చెప్పినా.. టీఎస్ పీఎస్సీ మాత్రం స్పందించడం లేదు. బహుశా.. ఉద్యోగుల విభజన పూర్తయ్యేవరకూ పరీక్ష పెట్టకూడదనుకున్నారో.. లేదా.. ఏపీ తర్వాత పెట్టాలనుకుంటున్నారో తెలియదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: