విజయసాయి రెడ్డి.. ఈయన స్వతహాగా రాజకీయ నాయకుడు కానే కాదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కేవీపీ ఎలాగో.. జగన్ కు విజయ సాయిరెడ్డి అలాగ. కనీసం కేవీపీ అయినా పరోక్ష రాజకీయాల్లో చక్రం తిప్పాడు.. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అనేక రాజకీయ వ్యవహారాలు నడిపాడు.. కానీ విజయసాయికి అలాంటి నేపథ్యమూలేదు. 

ఆయనో ఇంటలిజెంట్ ఆడిటర్. జగన్ పై ఇన్ని కేసులు ఉన్నా.. ఒక్కటీ నిర్థరణ కాకపోవడానికి కేవలం విజయసాయిరెడ్డి మాస్టర్ బ్రెయినే కారణమని చెబుతారు. అప్రూవర్ గా మారిపోవాలని ఎన్ని వత్తిళ్లు వచ్చినా విజయసాయి లొంగలేదని కూడా చెబుతారు. అలాంటి ఆడిటర్ ఇప్పుడు రాజ్యసభ మెంబర్ అయ్యారు. అతి కీలకమైన ప్రత్యేక హోదాపై ప్రైవేటు బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు వైసీపీ తరపున మాట్లాడారు.  


రాజ్యసభలో తొలిసారి విజయసాయిరెడ్డి చేసిన ప్రసంగం ఆకట్టుకునేలా ఉంది. మొదటి సారే అయినా ఆయన ఏమాత్రం తడబడలేదు. సూటిగా సుత్తి లేకుండా ప్రత్యేక హోదాపై విజయసాయి పాయింటుకొచ్చేశారు. సాధికారకంగా అనర్ఘళంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో సిఎం చంద్రబాబు మాట మార్చినా డిమాండ్ నుంచి తాము తప్పుకునే ప్రసక్తే లేదని విజయసాయి తేల్చి చెప్పారు. 

ఆనాడు రాజ్యసభలో విభజన బిల్లు పెట్టినప్పుడు కూడా అది ఆర్థిక బిల్లు అయినా దాన్ని ఎవరూ లేవనెత్తలేదని, కానీ ఆ బిల్లులో కొన్ని సవరణలు చేసేందుకు , లేదా ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు ప్రవేశపెట్టిన బిల్లును ఏవిదంగా ఆర్థికబిల్లు ఎలా అంటారని పాయింటు లేవనెత్తారు. ఆనాటి ప్రభుత్వం తరపున అప్పటి ప్రధాని హామీ ఇప్పటి ప్రభుత్వం నెరవేర్చకపోతే సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్న అనుమానం కలుగుతుందన్నారు. మొత్తానికి విజయసాయి తొలిప్రసంగం ఆకట్టుకుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: