ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాలు తాము అవినీతి రహితం అని గొప్పలు చెప్పుకుంటున్నా.. ప్రతి శాఖలోనూ అవినీతి అంతర్గతంగా రాజ్యమేలుతోందనేది బహిరంగ సత్యం. ప్ర‌భుత్వ ఉద్యోగులంటే హాయిగా ఎంజాయ్ చేయ‌డం, లంచాలు పిండుకోవ‌డం అనే విష సంస్కృతికి బీజం వేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల‌పై ఉంది. రోగులు బయట వేచిచూస్తూ నానా అవస్థలు పడుతున్నా.. అదేమీ పట్టనట్టు కంప్యూటర్‌ తెరపై వస్తున్న సినిమాలో మునిగిపోయిన ప్ర‌భుత్వ ఉద్యోగున్ని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నాడు ఢిల్లీ డిఫ్యూటీ సీఎం. అలాంటి అల‌స‌త్వ‌, అవినీతి అధికారుల‌ను ఏరిపారేయాల్సిన బాధ్య‌త మ‌న తెలుగు ముఖ్య‌మంత్రుల‌పై ఉంది.  


ఇందుగలడందులేదని సందేహం వలదు.. ఎందెందు వెదికినా అదందు కలడు అవినీతి అన్నచందంగా.. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేసే కార్య‌క్ర‌మాల్లో ప్ర‌భుత్వ అధికారుల అల‌స‌త్వం, అవినీతి జ‌డ‌లు విప్పుతోంది. సామాన్యుడికి ప్ర‌భుత్వ‌ ఫ‌లాలు చేర‌డం లేదు. దీనికి కారణం అధికారులే. నిత్యం ప్ర‌తి ప్ర‌భుత్వ కార్యాల‌యల్లోనూ అధికారులు ఆగ‌డాలు పెచ్చుమీరుతున్నాయి. 


నిజానికి అవినీతి, అల‌స‌త్వ‌ అధికారులు భ‌య‌ప‌డేది ఒక్క ప్ర‌భుత్వానికే. ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపే ప్ర‌భుత్వ అధికారులు మీడియా వారికి సైతం దొర‌క్కుండా ప‌ని కానిచ్చేస్తుంటారు. అలాంటి అధికారుల భ‌ర‌తం ప‌ట్టాలంటే ఖ‌చ్చితంగా ప్ర‌భుత్వం దిగిరావాల్సిందే. ఆకస్మిక త‌నిఖీలు చేప‌ట్టి అలాంటి అధికారుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఏరిపారేస్తుంటే త‌ప్పా, ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొర‌క‌దు. ప్ర‌భుత్వ అధికారుల్లో అవినీతి త‌గ్గిపోయిందంటూ ప్ర‌భుత్వాలు గొప్ప‌లు చెప్పుకుంటున్నా.. నిజానికి ఆ ప‌రిస్థితి ఎక్క‌డా లేదు. 


గ‌తంలో మ‌న ముఖ్య‌మంత్రులు ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టారు. అప్పుడు అల‌స‌త్వ‌, అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుండేవి. ఎప్పుడు బుక్క‌వుతామోన‌నే టెన్ష‌న్ వారిలో ఉండేది. అందుకే కాస్త నాణ్య‌త‌గా ప్ర‌భుత్వ‌, ప్ర‌జ‌ల ప‌నులు చేసే వారు. అయితే ఇప్పుడా ప‌రిస్థితి లేదు. తాజాగా ఢిల్లీలోని ఓ ప్ర‌భుత్వ అధికారి కంప్యూటర్‌లో హాయిగా సినిమా చూస్తుండ‌గా దిమ్మదిరిగే షాక్‌ తగిలింది. ఓవైపు రోగులు బయట వేచిచూస్తూ నానా అవస్థలు పడుతున్నా.. అదేమీ పట్టనట్టు కంప్యూటర్‌ తెరపై వస్తున్న సినిమాలో మునిగిపోయాడు ఆ ప్రబుద్ధుడు.


ఏకంగా డిప్యూటీ సీఎం తనిఖీలు వచ్చినా ఆయనకు ఆ విషయం తెలియలేదు. డిప్యూటీ సీఎం నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్లి భుజం తట్టాడు. అప్పుడుగానీ ఆయన సినిమాలోకంలోంచి ఈ లోకంలోకి రాలేదు. ఇలా ఆకస్మిక తనిఖీ ద్వారా ఓ ప్రభుత్వ ఉద్యోగిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని ఉద్యోగంలో తీసేశారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. కంప్యూటర్‌ లో సినిమా చూస్తున్న ఉద్యోగిని డైరెక్ట్‌గా పట్టుకున్న సంఘటన తాలుకు వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆలోచింప‌జేస్తోంది. 


ఢిల్లీ త‌ర‌హాలో తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా ప్ర‌భుత్వ ఆఫీసుల్, హ‌స్పిట‌ల్లో ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించాల‌ని ఏపీహెరాల్డ్ కోరుకుంటోంది. అల‌స‌త్వం ఉన్న అధికారుల‌ను వెంట‌నే తొల‌గించాలి. స‌మ‌ర్థ‌త‌, స‌త్తా ఉన్న వారికి అవ‌కాశం క‌ల్పించాలి. అప్పుడే స్వ‌చ్ఛ‌మైన స‌మాజం ఆవిర్భ‌విస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: