సోష‌ల్ మీడియా మ‌రో హాట్ చ‌ర్చ‌ను తెర‌పైకి లాగింది. ఆ చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ వేడి పుట్టిస్తోంది. ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన సింధుపై ప్రశంస‌లు కురిపిస్తూ ఆమెను తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించాల‌న్న డిమాండ్ మొద‌లైంది. ఇంత‌కీ తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా సింధును నియ‌మించ‌డం స‌బ‌బేనా? టెన్నిస్ సంచ‌ల‌నం సానియా మీర్జాను ప‌క్క‌న‌పెట్ట‌డం స‌రైందేనా? ఇవే ప్ర‌శ్న‌లు ఇప్పుడు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.  


యువ సంచ‌ల‌నం సింధుపై దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులంతా చెయ్యెత్తి జైకొడుతున్నారు. ఇక‌ తెలుగు రాష్ట్రాలు అయితే సింధుపై అపార‌మైన‌ లోక‌ల్ ప్రేమ చూపిస్తున్నాయి. తెలంగాణ స‌ర్కార్ సింధుకు 5 కోట్ల న‌జ‌రానా ప్ర‌క‌టించింది. ఏపీ ప్రభుత్వం తరఫున 3 కోట్లు ఇవ్వ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఇంత‌వ‌ర‌కు బాగానే వుంది. అయితే ఇదే స‌మ‌యంలో సింధును తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మించాల‌న్న చ‌ర్చ ఊపందుకుంటోంది. నెటిజ‌న్లు మాత్రం సింధుసానియామీర్జా ఫోటోలు పెడుతూ తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా సింధునే నియ‌మించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 


సింధు తెలంగాణ అమ్మాయిగా బ‌తుక‌మ్మ ఆడింది. బోనం ఎత్తింది. విశ్వ‌వేదిక‌పై తెలంగాణ కీర్తిని చాటిందంటూ సింధుపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. సానియా మీర్జా స్థానంలో సింధును తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మించాలంటున్నారు. ఒలింపిక్స్ లో సానియా మెడ‌ల్ సాధించ‌లేక‌పోయింది. మ‌హిళ‌ల డ‌బుల్స్ తొలి రౌండ్ లో వెనుదిర‌గ‌గా.. మిక్స్‌డ్ డ‌బుల్స్ లో సెమీస్‌లో ఓట‌మిపాలైంది. దీంతో నెటిజ‌న్లు సింధు వైపే మొగ్గు చూపుతున్నారు. ఐతే క్రీడా పండితులు మాత్రం సానియా ప‌త‌కం తేనంత మాత్రాన ఆమెను అగౌర‌వ ప‌ర‌చొద్ద‌ని సూచిస్తున్నారు. ఆట‌లో మ‌తాన్ని చేర్చొద్ద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. క్రీడ‌ల్లో గెలుపుఓట‌ములు స‌హ‌జ‌మ‌ని చెబుతున్నారు. 


తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కొన‌సాగుతున్న సానియా మీర్జాపై అడ‌పాద‌డ‌పా విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. తెలంగాణ స‌ర్కార్ అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల్లో, ప‌థ‌కాల్లో సానియా పాల్గొన‌డం లేద‌న్న వాద‌న ఉంది. రెండేళ్ల క్రితం.. జూన్ 22, 2014న తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందుకోసం ఆమెకు కోటి రూపాయల చెక్కును కూడా తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. నూతన రాష్ట్రం కావడంతో దేశవిదేశాల్లో తెలంగాణ గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమె నియామకం ఉపయోగపడుతుందని భావించారు. రెండేళ్ల త‌ర్వాత‌క పరిస్థితిని గమనిస్తే.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏ కార్యక్రమంలోనూ సానియా పాల్గొన్న జాడ కనిపించడం లేదని ప్ర‌తిప‌క్ష‌పార్టీలు విమ‌ర్శిస్తున్నాయి. నిజానికి అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్ల సమయంలో సానియా బిజీగా ఉంటుంది. ఆ సమయాన్ని మినహాయిస్తే సానియా హైదరాబాద్‌లో ఉన్నప్పుడైనా ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఆమెను వాడుకోవడం లేద‌ని.. పర్యాటక రంగ అభివృద్ధికి, సాంస్కృతిక వారసత్వాన్ని చాటడానికి, ప్రధాన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సానియా సాయం తీసుకునే వీలున్నా.. ప్రభుత్వం వైపు నుంచి ఆ దిశగా ప్రయత్నాలేవీ జరగలేదని ప్ర‌తిప‌క్ష నేత‌లు ఆరోపిస్తున్నారు.


నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విదేశాల్లో ప్రమోట్ చేసేందుకు బ్రాండ్ అంబాసిండర్‌గా సానియాను నియామకం ఉపయోగపడుతుందని అప్ప‌ట్లో టీస‌ర్కార్ ప్రకటించింది. తెలంగాణ ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవ‌ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రచారం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టింది. ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్ కూడాలో సానియా మాత్రం ఎక్కడా కనిపించలేదన్న విమ‌ర్శ‌లు వినిపించాయి. రాజధాని నగరంలో మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన 'షీ టీమ్స్' అధికార ప్రతినిధిగా సానియా ఉంటే బాగుంటుందని కొందరు అధికారులు భావించినప్పటికీ కుదరలేదు. ఆమె టెన్నిస్‌తో బిజీగా ఉందని అధికారులు చెబుతుండగా సానియా మాత్రం తన ఆటోబయోగ్రఫీ 'ఏస్ ఎగైనెస్ట్ ఆడ్స్' ప్రచారంలో బిజీగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'తెలంగాణకు హరితహారం' అనే కార్యక్రమంలో చిరంజీవి, నాగార్జున లాంటి సినీనటులు పాల్గొన్నారు. బ్రాండ్ అంబాసిడర్ సానియా మాత్రం కనిపించలేదు. ఈ విషయమై టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్ దిన పత్రిక ప్రభుత్వ అధికారులు, ఆమె కుంటుంబ సభ్యుల వద్ద ఆరా తీసింది. దీంతో త‌ర్వాతి రోజు సాయంత్రం సమయంలో పెరట్లో సానియా మొక్కను నాటుతున్న ఫొటోలు ట్విట్టర్లో దర్శనమిచ్చాయి. . సెలబ్రిటిలంతా హరితహారంలో మొక్కలు నాటితే సానియా ఒక్క మొక్కతో సరిపెట్టి, ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి మాత్రం మౌనంగా ఉండిపోయింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది.


సానియా ఏయే విధులు నిర్వహించాలనే విషయమై ఆమెతో ఒప్పందమేదీ చేసుకోలేదని సమాచార, ప్రజా సంబంధాల విభాగం చెబుతోంది. అయినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల్లో సానియా భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని, నగరంలో ఉన్నప్పటికీ ఆమె ప్రభుత్వ అధికారులకు అందుబాటులో ఉండటం లేదని అధికారులు వాపోతున్న‌ట్టు కూడా టాక్ వినిపిస్తోంది. సానియా సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదా..? లేక సానియాకే టీస‌ర్కార్‌కు అవసరం లేదా.. అనే అనుమానాలు కూడా నెటిజ‌న్లు వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమె ఎంపికైన తర్వాత తెలంగాణ టూరిజాన్ని విశ్వవ్యాపితం చేస్తానని గతంలో హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వ పథకాల్లో ఏనాడూ కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో అంత‌ర్జాతీయ వేదికపై మ‌రో హైద‌రాబాద్ ఆణిముత్యం త‌ళుక్కున మెరిసింది. దీంతో అంద‌రి దృష్టి సింధుపై ప‌డింది. స‌హ‌జంగా నెటిజ‌న్లు త‌మ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అయితే ఇక్క‌డ సానియాను తెలంగాణ‌ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా త‌ప్పించ‌డం, ఆ అవ‌కాశం సింధుకు ఇవ్వ‌డం అనేది ఏకైక మార్గ‌మ‌ని చెప్ప‌డానికీ వీలు లేదు. చేయాల్సిన ప‌నిని సంపూర్ణంగా చేస్తే విమ‌ర్శ‌లు త‌గ్గుతాయ‌నే విష‌యం మాత్రం బాధ్య‌త‌ల్లో ఉన్న‌వారు గుర్తెర‌గాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: