కేంద్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆమోదించిన జీఎస్‌టీ బిల్లును ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో కూడా ఏక‌గ్రీవంగా ఆమోదం పొందింది. ఈ ఉద‌యం తెలంగాణ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి అనుమ‌తితో సీఎం కేసీఆర్ జీఎస్‌టీ బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జీఎస్‌టీ బిల్లును పార్లమెంట్‌ ఏకగ్రీవంగా ఆమోదించిందని గుర్తు చేశారు. ఏ రాష్ట్రం కూడా తమ పన్ను ఆదాయన్ని కోల్పోవడానికి ఒప్పుకోదని... తమ ప్రయోజనాలు కాపాడాలని అన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయని తెలిపారు.

 

ప్ర‌పంచ వ్యాప్తంగా 150 దేశాల్లో అవలంభిస్తున్న విధానాలకు అనుగుణంగా ఒకే దేశం-ఒకే పన్ను విధానం జీఎస్‌టీ ద్వారా అమల్లోకి వస్తుందన్నారు. ఇప్పటికే 9 రాష్ట్రాల అసెంబ్లీలు జీఎస్‌టీ బిల్లును ఆమోదించాయని సీఎం తెలిపారు. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపితే జీఎస్‌టీ చట్టం అవుతుందని సభ్యులకు వివరించారు. జీఎస్‌టీ చట్టం ద్వారా దేశ వ్యాప్తంగా సేవారంగం విస్తృతమవుతోందని వెల్లడించారు. వ్యాట్‌ ద్వారా గతేడాది రాష్ట్రానికి 31 వేల 170 కోట్ల ఆదాయం వచ్చిందని, జీఎస్‌టీ ద్వారా సేవా పన్నులో 50శాతం వాటా రాష్ట్రాలకు వస్తుందన్నారు. రాష్ట్రంలో సేవాపన్ను ఆదాయంలో 35శాతం వృద్ధి నమోదైందని సీఎం వెల్లడించారు. జీఎస్‌టీ కౌన్సిల్‌ పన్ను రేటు, విధానాలను రూపొందిస్తుందని, జీఎస్‌టీ కౌన్సిల్‌ ఆమోదం తర్వాత పార్లమెంట్‌కు వెళ్లి చట్టంగా ఆమోదం పొందుతుందని తెలిపారు.

 

జీఎస్‌టీపై సభ్యులు చర్చించిన అనంతరం శాస‌న‌స‌భ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. జీఎస్‌టీ బిల్లు తీర్మానాన్ని సభ్యులంతా ఆమోదించటం శుభపరిణామమని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో జీఎస్‌టీ వల్ల ఆర్థిక సంస్కరణలు రానున్నాయని, దేశం యెక్క దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే జీఎస్‌టీ అని సీఎం వివరించారు.

 

 జీఎస్‌టీ బిల్లుతో పాటు  రాష్ట్రంలో రైతుల స‌మ‌స్య‌లు, ప్రాజెక్టులు త‌దిత అంశాల‌పై కూడా అసెంబ్లీలో చర్చిచాల‌ని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు టీఆర్ఎస్‌ ప్రభుత్వం అడ్డుపడుతోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. జీఎస్‌టీ బిల్లు ఆమోదం కోసం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులు జరపాలని తాము చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిన్నారెడ్డి విమర్శించారు. జీఎస్‌టీ బిల్లు ఆమోదంతో పాటు రాష్ట్ర సమస్యలు చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్‌ మూడు రోజులు సమావేశం అవుతుంటే.. తెలంగాణలో మాత్రం ఒక్కరోజే నిర్వహించడం దారుణమన్నారు. రైతుల సమస్యలతో పాటు వివిధ సమస్యలను సభలో ప్రస్తావించాలని తాము చేసిన ప్రయత్నాన్ని ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు.

 

రైతుల సమస్యలపై టీఆర్ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఓ పక్క రుణాలు అందక, మరోవైపు వర్షాభావ పరిస్థితులతో రైతాంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మండిపడ్డారు. కృష్ణా జలాల విడుదలలో రాష్ట్రానికి అన్యాయం జరిగితే ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: