తెలంగాణ ప్ర‌భుత్వంపై టీ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విరుచుకుప‌డ్డారు. జీఎస్‌టీ బిల్లు కోసమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారని, అయితే మరో మూడు ఆర్డినెన్స్‌ల ఆమోదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. నిబంధనల ప్రకారం ఆర్డినెన్స్‌లపై రెండు రోజుల ముందే ప్రతిపక్షాలకు సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు. రాజకీయ అజెండాతో ప్రభుత్వం ముందుకెళ్తోందని విమర్శించారు. త్వరలో కరువు ప్రాంతాల్లో టీడీపీ నేతలు పర్యటించ‌నున్నార‌ని  రేవంత్‌ రెడ్డి తెలిపారు.

 

మంగళవారం రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ తనను తిట్టినవారికి ఉద్యోగాలు, ప్ర‌మోష‌న్లు గ్యారంటీ అని ఛ‌లోక్తులు విసిరారు. కొంద‌రు టీఆర్ఎస్ నేత‌లు త‌న‌ను తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని అన్నారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రమోషన్లు వచ్చాయని, మరో వ్యక్తికి పీఆర్‌వోగా ఉద్యోగం వచ్చిందని అన్నారు.

 

కేసీఆర్ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న కొత్త జిల్లాల ఏర్పాటు సరిగా లేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. మీడియాలో తనకు ప్ర‌చారం రాకుండా రాష్ట్ర ప్ర‌భుత్వం అడ్డుకుంటుంద‌ని, అందులో భాగంగానే తాను నిర్వ‌హిస్తున్న ప్రెస్ మీట్లు, ఇత‌ర అంశాల‌కు సంబంధించిన  వార్తలు తగ్గుతున్నాయని అన్నారు, తెలంగాణ ప్రభుత్వం కావాలనే త‌న‌కు సంబంధించిన వార్త‌లు తగ్గించే ప్రయత్నం చేస్తోందని రేవంత్ ఆరోపించారు. రాష్ట్ర ప్ర‌భుత్వంపై పోరాటం ఆగ‌ద‌ని, ప్ర‌జ‌ల కోసం నిరంత‌రం ప్ర‌భుత్వం పోరాడుతాన‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: