పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది.  తెల్లవారు జామునుంచే  వర్షం ముంచెత్తటంతో జంటనగరాలు ఉలిక్కిపడ్డాయి. ఏకధాటిగా నాలుగు గంటలకు పైగా కుండపోత వర్షం పడటంతో నగర ప్రజలు బెంబేలెత్తిపోయారు.  వాన నీరు, నాలాలు పొంగిపొర్లడంతో..  రోడ్లు వాగుల్ని తలపించాయి. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితి చెప్పనక్కర్లేదు, చెరువులను మరిపించాయి. ఇళ్లలో మోకాలులతోతు నీళ్లు చేరడంతో వస్తువులన్నీ మునిగిపోయాయి.  కుండ పోత వాన నగరంలో పలుచోట్ల విషాదం నింపింది. భోలక్ పూర్ లో ఇల్లు కూలి ముగ్గురు మృతి చెందగా, రామాంతపూర్ లో నిర్మాణంలో ఉన్న గోడ కూలి నలుగురు మృత్యువాత పడ్డారు. 

Image result for heavy rain hyderabad

బోలక్‌పూర్‌లో ఇల్లు కూలి ముగ్గురి మృతి
ముషీరాబాద్‌ బోలక్‌పూర్‌లో భారీ వర్షానికి పాత ఇల్లు కూలి ముగ్గురు మృతి చెందారు. ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి పాత ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న మహిళ,  ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని సమీపంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దిల్‌కుష్‌(26) మారియా(3) జేబా ఫాతిమా(2) మృతిచెందారు. 


రామాంతపూర్ లో గోడ కూలి నలుగురు దుర్మరణం
రామంతాపూర్‌లో భారీ వర్షానికి నూతనంగా నిర్మిస్తున్న భవనం ప్రహరీ గోడ కూలి నలుగురు మృతి చెందారు.  పాలమూరు జిల్లా కొల్లాపూర్‌ మండలం మల్లచింతపల్లికి చెందిన బాలస్వామి కుటుంబం ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి జీవనం సాగిస్తున్నారు. నూతనంగా నిర్మితమౌతున్న ఇందిరా ఇంపీరియల్‌ కాంప్లెక్స్‌ భవనం పక్కన గుడిసె వేసుకుని నివసిస్తున్నారు. బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి నూతనంగా నిర్మిస్తున్న ఇందిరా ఇంపీరియల్‌ కాంప్లెక్స్‌ భవనం ప్రహరీ గోడ కూలి గుడిసెపై పడింది. ఈ ప్రమాదంలో శేఖర్‌(12), పార్వతి(18) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన బాలస్వామి, చెన్నమ్మ(35)లను మాట్రిక్స్‌ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. 


వాన నీటిలో ఖైరతాబాద్ రైల్వేస్టేషన్

ఏకధాటిగా కురిసిన వర్షంతో ఖైతరాబాద్ రైల్వే స్టేషన్ నీట మునిగింది. రైల్వే రిజర్వేషన్, జనరల్ బుకింగ్ కౌంటర్లలో మోకాలిలోతు వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో సిబ్బందితో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చుట్టేసిన వర్షపు నీటిలోనే సిబ్బంది విధులు నిర్వర్తించారు. స్టేషన్ ప్రాంగణంలో పార్క్ చేసిన వాహనాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. ఖైరతాబాద్ లోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ లోతట్టు ప్రాంతంలో ఉండటం వల్ల కొద్దిపాటి వర్షాలకే నీట మునుగుతోందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇప్పటికైనా అధికారులు స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 


అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు -జీహెచ్ఎంసీ 
భాగ్యనగరంలో భారీ వర్షం తో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.  మరికొద్ది గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. సహాయక చర్యలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్, అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ డ్రైనేజీ వ్యవస్థ 20 మి.మీ వర్షపాతం మాత్రమే తట్టుకోగలదని, ఇవాళ హైదరాబాద్‌లో 60 మిల్లీ మీటర్ల వర్షం కురిసిందని సమావేశానంతరం జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ కమిషనర్లు, ఏంఎంహెచ్‌వోలను  అప్రమత్తం చేశామన్నారు.

ప్రమాదకరమైన మ్యాన్ హోల్స్ తెరవవద్దని సిబ్బందిని ఆదేశించారు.  ప్రజలు కూడా అవసరమైతే తప్ప బయటకు రావద్దని కమిషన్ విజ్ఞప్తి చేశారు. పాత భవనాల్లో ఉండే వారు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 040-21111 111, లేదా 100 నంబర్‌కు ఫోన్‌ చేయాలని తెలిపారు.




మరింత సమాచారం తెలుసుకోండి: